విద్యారంగ అభివృద్దికి చర్యలు తీసుకోవాలి

ఖమ్మం,జూన్‌27(జ‌నం సాక్షి): రాష్ట్రం ఏర్పడి దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్దికి చేసింది ఏం లేదని టీపీటీఎఫ్‌ జిల్లా నాయకులు అన్నారు. ఉద్యమాల ద్వారా వచ్చిన ముఖ్యమంత్రికి, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు తీసుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాల మూసివేతకు జరుగుతున్న కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. సమాజాభివృద్ధికి విద్యే పునాది అని ఆధునిక వ్యవస్థలో చదువుకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో పిల్లల చదువుకు కుటుంబాలు అత్యధికంగా డబ్బు వెచ్చిస్తున్నాయనే విషయాన్ని నివేదికలు పేర్కొంటున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచితే కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలన్నారు. నాటి నిజాం కాలంలో మూడువేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని పేర్కొన్న ఆయన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే సర్కారు బడులు కూడా మూతపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యను క్రియాశీలకంగా తీసుకుంటున్న ప్రభుత్వం, ఉన్నతవిద్య పట్ల ముభావంగా వ్యవహరిస్తున్నాయని ఈ తరహా ధోరణులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచే ప్రారంభమయ్యాయని విమర్శించారు.