విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి- మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్

హుజూర్ నగర్ నవంబర్ 22 (జనంసాక్షి): విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజూర్ నగర్ నందు మండల స్థాయి జనవిజ్ఞాన వేదిక చెకుముకి టాలెంట్ పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి సైదా నాయక్ పాల్గొన్నారు. మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలనీ, సైన్స్ పట్ల అభిరుచి పెంపొందించుకోవడానికి ఇలాంటి పరీక్షలు దోహదపడతాయని అన్నారు. అనంతరం మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాల తెలుగు మీడియం విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజూర్ నగర్, ఇంగ్లీష్ మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు హుజూర్ నగర్, ప్రైవేట్ పాఠశాలల విభాగంలో గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక చేయబడ్డారు. వీరందరికీ మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ చేతులమీదుగా మేమేంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల హుజూర్ నగర్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అబ్దుల్ లతీఫ్, చెకుముకి జిల్లా కార్యదర్శి, కన్వీనర్ కలకుంట్ల సైదులు, మండలంలోని వివిధ పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.