విద్యార్థుల్లేరన్న సాకుతో 1,284 సర్కారీ బడుల మూసివేతకు నిర్ణయం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) :
విద్యార్థుల్లేరన్న సాకుతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,284 ప్రాథమిక పాఠశాలలు మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖమంత్రి ఎస్‌. శైలజానాథ్‌ వెల్లడించారు. పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగినంత లేనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం రాజీవ్‌ విద్యా మిషన్‌ ఆధ్వర్యంలో జూబ్లీహాల్‌లో జరిగిన విద్యాహక్కు చట్టం అమలు సదస్సులో మంత్రి పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తామని మంత్రి చెప్పారు. పదిమంది విద్యార్థుల లోపు ఉన్న పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించామని అన్నారు. 886 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని చెప్పారు. నాలుగువందల పాఠశాలల్లో నలుగురు విద్యార్థులు కూడా లేరని అన్నారు. అందువల్లే   ఆ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించామన్నారు. అయితే పదిమంది లోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసి వేసి అక్కడ ఉన్న విద్యార్థులను వాహనాల ద్వారా సమీపంలోని పాఠశాలలకు పంపేలా రవాణ సౌకర్యాన్ని  ఏర్పాటు చేయాలని ఆయా ప్రధానోపాధ్యాయులను ఆదేశించామని చెప్పారు. నిర్బంధ విద్యపై ఇప్పటికే చైతన్యం తీసుకొస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. ఇప్పటికే లక్షా 60వేలమంది విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నారని శైలజానాథ్‌ తెలిపారు. విద్యాహక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్‌ విద్యామిషన్‌ డైరెక్టర్‌ ఉషారాణి పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు, నాయకులు పాల్గొన్నారు.