విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలం తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్ గౌడ్

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వ అధికార యంత్రంగా విఫలమైందని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని జక్లేర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సి ఉండగా అధికారులు మాత్రం విద్యను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించలేదని, సరియైన బోధన సిబ్బంది లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన భోజనం అందించలేకపోవడంతో విద్యార్థుల అవస్థలు పడుతున్నారని అధికార యంత్రాంగాన్ని ఎద్దేవా చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించవలసి ఉండగా ఏ ఒక్క పాఠశాలలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా విద్యార్థులు అనారోగ్యాల బారిన పడిన ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలోని బీర్కూరు పాఠశాలలో సాయిరాజ్ అనే ఐదవ తరగతి విద్యార్థి పాముకాటుకు గురై మరణించాడని విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించిన అధికారులపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మరణించిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు విజయ్ ,రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు