విద్యుత్ కోతలకు నిరసనగా
తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు
హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి):
కరెంటు కోతలకు నిరసనగా టిఆర్‌ఎస్ సోమవారం తెలంగాణ ప్రాంతమంతటా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లను ముట్టడిం చారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని పది జిల్లాల్లో టిఆర్‌ఎస్ నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ మాదాపూర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. ఉన్నవారికి కట్టబెట్టారు.. లేనివారి వద్ద దోచుకుంటోందని ప్రభుత్వ దమననీతిని ఖండించారు. మెదక్‌జిల్లా పటాన్‌చెర్వులోని సబ్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు రాస్తారోకో నిర్వహిం చారు. అలాగే మహబూబ్‌నగర్‌లో అడ్డాకుల వద్ద జాతీయ రహదారిపై టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని నల్గొండ, నాగార్జునసాగర్, హూజూరాబాద్, నార్కెట్‌పల్లి, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లోని సబ్ స్టేషన్ల ఎదుట నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. యాదగిరిగుట్టలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సునీత నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలోని జిల్లా సబ్ స్టేషన్ ఎదుట జరిగిన ధర్నాలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఉట్నూరు, బెల్లంపల్లి, ఇచ్చోడ, మంచిర్యాల, జిన్నారం తదితర ప్రాంతాల్లోని సబ్ స్టేషన్ల ఎదుట నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, గార్లలోని విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద రాస్తారోకోలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ సబ్‌స్టేషన్‌ను నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. అలాగే బాన్సువాడ, ఆర్మూరు, బోధన్‌లలోని సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని చందానగర్, కొత్తపేట, ఎల్‌బినగర్‌లలోని విద్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని సబ్ స్టేషన్ వద్ద ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విద్యాసాగర్, నర్సంపేటలో జిల్లా కన్వీనర్ సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. హన్మకొండ లోని నక్కలగుట్టలోని ఎపిసిపిడిపిఎల్ సిఎండి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయభాస్కర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, ధర్మపురి, జగిత్యాలలోని సబ్ స్టేషన్ల వద్ద నిరసన ప్రదర్శనలను ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిర్వహించారు. కమలాపూర్ సబ్ స్టేషన్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నాయకత్వంతో ధర్నా జరిగింది.