విద్యుత్‌ కోతలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి : హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) :  విద్యుత్‌ సంక్షోభంపై శాసనసభలో మంగళవారంనాడు వాడీ వేడి చర్చ జరిగింది. సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమంటూ టిఆర్‌ఎస్‌ సహా పలు విపక్షాలు దాడి చేశాయి. ఈ సందర్భంగా విద్యుత్‌ సంక్షోభంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన సమాధానాన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తప్పుబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రి వాస్తవాలు చెప్పకుండా అంకెల గారడీ చేశారని ధ్వజమెత్తారు. సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. వేళాపాళ లేని విద్యుత్‌ సరఫరాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు.  బొగ్గును అధిక ధరకు కొనడం వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. తక్కువ ధరకే బొగ్గును కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. తక్కువ ధరకు బొగ్గు కొనేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ముందే చెప్పామని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. రూ. 3,500లకే బొగ్గు దొరుకుతుండగా రూ.5వేలు ఎందుకు చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల మాటలు విని ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటన చేశారని అన్నారు.

తెలంగాణకు విద్యుత్‌ సరఫరాలో అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమా అని ఆయన సవాల్‌ విసిరారు. తెలంగాణకు ఏడుగంటలు సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు సీఎం నిరూపిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు సరిగా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని, కోస్తాంధ్రలో ఉన్న ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో కేవలం 2ఫీడర్లపరిధిలో7గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు. అక్కడ ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేసి తెలంగాణలో కనీసం నాలుగైదు గంటలు కూడా సరఫరా చేయడం లేదని అన్నారు.

అంతకు ముందు విద్యుత్‌ సమస్యపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య సభలో మాట్లాడుతూ సునామీ, తుఫాన్‌ మాదిరిగానే విద్యుత్‌ సమస్యను కూడా విపత్కర సమస్యగా భావించాలని అన్నారు. వచ్చే 9నెలల్లో విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. విద్యుత్‌ వినియోగం , ఉత్పత్తి, భద్రతా, నాణ్యమైన సరఫరా, నష్టంలేని విధానాలతో కేంద్రం చేసిన చట్టంలోని సంస్కరణలలో భాగంగానే ఇక్కడ కూడా సంస్కరణలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఐ విధానం కొత్తగా వచ్చింది కాదన్నారు. 2003 నుంచే ఈ విధానం అమల్లో ఉందన్నారు. దీని ద్వారా ప్రజలపై భారం పడకుండా వెసులుబాటు కల్పిస్తూనే ఉన్నామన్నారు. 2003-04లో రూ.203కోట్లు, 2004-05లో రూ.141కోట్లు, 2005-06లో రూ. 156కోట్లు, 2010-11లో రూ.268కోట్లు, 2011-12లో రూ.3,957కోట్లు మేరకు వెసుబాటు కల్పించామన్నారు.  ఒక్క ఎకరా పంట కూడా ఎండకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. అనివార్య పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పొన్నాల తెలిపారు.రూ.16కోట్లు ఖర్చు చేసి రోజుకు 12శాతం విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం నుంచి ఒక్క యూనిట్‌ విద్యుత్‌ను కూడా విక్రయించడం లేదని స్పష్టం చేశారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంస్కరణల గురించి, ఎఫ్‌ఎస్‌ఐ వెసులుబాటు గురించి మాట్లాడుతున్నప్పుడు టిడిపి, టిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుతగులుతూ మంత్రి అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెతారు. విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై తాను జవాబిస్తానని మంత్రి చెప్పారు. మన లొల్లితో ప్రజలను మభ్యపెట్టవద్దు. అన్ని వాస్తవాలే వివరిస్తున్నాం. ప్రభుత్వం చేసింది చేసినట్టుగానే చెబుతున్నాం. చేయలేనిది చేయలేకపోతున్నామని అర్థం చేసుకోవాలని వివరిస్తున్నామని మంత్రి లక్ష్మయ్య చెప్పారు. తెలుగుదేశం సభ్యులు ఇంకా గందరగోళం సృష్టించడంతో మీరు ప్రవేశపెట్టిన బ్లాక్‌ పేపర్‌ గురించి కూడా వివరిస్తానని, పేపర్‌ మొత్తం చదువుతా అని మంత్రి లక్ష్మయ్య అన్నారు. మంత్రి వివరణపై టిఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు మాట్లాడుతూ ఎఫ్‌ఎస్‌ఐలో ఎంతో వేసులుబాటు కల్పించామని మంత్రి చెబుతున్న మాట అవాస్తవమని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలను, సభలను తప్పుదోవపట్టించడం మంచిది కాదని ఆయన అన్నారు.