విద్యుత్‌ కోతలు పూర్తిగా ఎత్తివేయండి రైతులకు 7గంటల విద్యుత్‌ సరఫరా చేయాలి

ఏలూరు, జూలై 17: వ్యవసాయ, పారిశ్రామిక రంగంపై ఆధారపడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ కోతల వలన రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తక్షణమే విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని జిల్లా వైఎస్‌ఆర్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పిలుపుమేరకు విద్యుత్‌ సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై జిల్లావ్యాప్తంగా పార్టీ కన్వీనర్‌ కొయ్యే మోషేన్‌రాజు నాయకత్వంలో మంగళవారం పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించామని ఏలూరులో ట్రాన్స్‌కో ఎస్‌ఇ సూర్యప్రకాశ్‌ని కలిసిన పార్టీ నేతలు తమ డిమాండ్లను వినతిపత్రం రూపంలో అందించారు. కొయ్యే మోషేన్‌రాజు సూచనల మేరకు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి, స్టీరింగ్‌ కమిటీ జిల్లా సభ్యులు పివి రావు, జిల్లా మీడియా కో-ఆర్డినేటర్‌ బివి రమణ, మండల పార్టీ కన్వీనర్‌ భూషణరావు, నేతలు నారా రామకృష్ణ, చంద్రమౌళి మాట్లాడుతూ జిల్లాలో ఎడాపెడా విద్యుత్‌ సరఫరాలో విధిస్తున్న కోతల వలన ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిరంతరం ఎలాంటి కోతలు లేకుండా 7గంటల విద్యుత్‌ సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఈ పరిస్థితి లేకుండా పోయిందని, దెందులూరు నియోజకవర్గంతో పాటు మెట్టప్రాంతాల్లో బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు విద్యుత్‌ సరఫరాలో కోతల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బివి రమణ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20 వేల పరిశ్రమలు మూతపడే ప్రమాదం తలెత్తిందని, వేలాది మంది కార్మికులు ఆకలి బాధలతో అలమటించే పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించిందన్నారు. పరిశ్రమలకు ఐదు రోజుల పాటు పవర్‌హాలిడే ప్రకటించడం వలన కార్మికులు ఉపాధి దెబ్బతింటోందని, రైసు మిల్లులు, ఐస్‌ ప్లాంట్లు వంటి చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోతున్నాయన్నారు. ఈ నెల 20 నుంచి ముస్లింల పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కానుందని, వారు నమాజ్‌లు చేసుకోవడానికి వీలుగా రాత్రి వేళల్లో విద్యుత్‌ కోతలు విధించకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎస్‌ఇ సూర్యప్రకాశ్‌ సానుకూలంగా స్పందించారు.