వినోబాభావే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి

గులాం నబీఆజాద్‌
నల్గొండ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి):
భూదానోద్యమనేత వినోబా భావే ఆలోచనలు, సిద్ధాంతాలు అనుసరించి ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, గాంధీజీ గ్లోబల్‌ ఫ్యామిలీ జాతీయ అధ్యక్షుడు గులాంనబీ అజాద్‌ పిలుపునిచ్చారు. అంతగా చదువు, విజ్ఞానం అందుబాటులో లేనప్పుడే వినోబాభావే పిలుపుతో ప్రజలు పెద్ద ఎత్తున భూములు దానం చేశారని అన్నారు. భూదానోద్యమం నడిపిన వినోబా చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని ఆయన అన్నారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రతిఒక్కరు ఆచరించాలన్నారు. ఆచార్య వినోబా భావే జయం తి సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో నిర్వహించిన విశ్వశాంతి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజాద్‌ మాట్లాడుతూ వినోబా భావే వల్లే పెద్ద ఎత్తున భూసంస్కరణలు అమలైయ్యాయని ఆయన అన్నారు. ఆయన బాటలో నడుస్తూ మనం కూడా భూదానానికి పూనుకుందామన్నారు. ఆయనలా మంచి పనులను ఏ ప్రభుత్వమూ చేపట్టలేకపోయిం దన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ సాటివారి క్షేమం కోసం పాటుపడటమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అజాద్‌ అన్నారు. నేడు మన దేశంలో కోట్లమంది సంపన్నులు ఉన్నారని కాని వారిలో పేదలకు సాయం చేయాలన్న భావన కొందరికే ఉందని అన్నారు. గాంధీజీ చూపిన బాటలో పయనిస్తూ పేద,సాదల క్షేమం కోసం పాటుపడాలన్నారు. ఏటా ఎందరో ఆకలితో చనిపోతున్నారు. వారి గురించి ఆలోచించాలని ఆజాద్‌ సూచించారు. ఆచార్య వినోభా ఆశయాలు ఆచరనీయం. భావితరాలకు ఆ ఆశయాలను అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బీబీనగర్‌ నిమ్స్‌ అధికారులతో మాట్లాడి కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యేటట్లు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు సర్వదా ఆచరణీయమని అన్నారు. అంతా గొప్పగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా తాను గాంధీ బోధనలు ఆశయా లతోనే ఎంతో ప్రభావితుడనై ఈ స్థితికి చేరుకు న్నానని చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి వివరిం చారు. గాంధీజీ కలలు కన్నట్టు ప్రతీ పేదవాడి కన్నీరు తుడవడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆసరా అందించేందుకే తాను ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని చేపట్టానని దీని ద్వారా పేదల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నా మని అన్నారు. గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ప్రతిఒక్కరు ముందుకు సాగాలని ఆయన జీవి తాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో పెదల అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. నల్గొండ జిల్లాలో చేనేతల సమస్యలు తనకు తెలుసని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులతో ఒక సదస్సును నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి
కృషి చేస్తానని చెప్పారు. అలాగే బీబీ నగర్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దశలవారీగా ఈ ఆసుపత్రిని అభివృద్ధి పరిచి పేదలకు సేవలను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి జానారెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్‌ నేత జి.చిన్నారెడ్డి తదితరులతో పాటు గాంధీజీ గ్లోబల్‌ ఫ్యామిలీ ఉపాధ్యక్షుడు ఎస్‌పీ వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌ రెడ్డి, కార్యదర్శి రామ్మోహన్‌రాయ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జలాల్‌పూర్‌ గ్రామంలోని రామనందతీర్థ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్మించిన కొత్త వసతి గృహాన్ని ఆజాద్‌ ప్రారంభించి, ట్రైనీలతో ముఖాముఖీ మాట్లాడారు. అనంతరం స్థానికంగా నిర్వహించే యజ్ఞంలో పాల్గొని ఫోటో గ్యాలరీని తిలకించారు. అలాగే కొత్తగూడెం నుంచి పోచంపల్లి వరకు రూ. 6కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. వినోబా భావే ఆశ్రయానికి రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బీబీనగర్‌ నిమ్స్‌ను 150 పడకలతో త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
సభలో తెలంగాణ నినాదాల హోరు
సభలో ఆజాద్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయాల్లో జై తెలంగాణ అంటూ తెలంగాణా వాదులు నినాదాలతో హోరెత్తించారు. ఎంపీ కోమటరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తెలంగాణ నినాదాలు ఇస్తూ హల్‌చల్‌ చేశారు. 2014కు ఎన్నికల ముందే తెలంగాణపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోనియా గాంధీతో ఆజాద్‌ సంప్రదించి తెలంగాణపై సత్వరమే ప్రకటన చేయాలంటూ తెలంగాణ నినాదాలు చేశారు. దీనిపై ఆజాద్‌ స్పందిస్తూ విశ్వశాంతి సమ్మేళనం జరుగుతున్న ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని అన్నారు. కాగా కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొన్న సభకు ఆటంకం కలిగిస్తూ నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలో కార్యక్రమాలు ముగించుకుని కేంద్రమంత్రి ఆజాద్‌తో పాటు, ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌కు తరలివెళ్ళారు.