విపక్షాల అనైక్యతే మోడీ బలం !
భారతదేశంలో బలమైన ప్రతిపక్షం అన్నది లేకపోవడంతో దేశంలో ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదిరించే వారు లేకుండా పోతున్నారు. రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా పెద్దగా స్పందన కానరావడం లేదు. విపక్షాలు కూడా విడివిడిగా తమ రాష్టాల్ల్రో అధికారం పొందడం ఎలా అన్న ఆలోచనలో మాత్రమే ఉన్నారు. విపక్షాల్లో ఉమ్మడిగా, కలసికట్టుగా పోరాడుదామన్న భావన లేకపోవడం కూడా మోడీకి కలిసి వస్తోంది. అందుకే ప్రబుత్వరంగం సంస్థలను అమ్ముతున్నా, విపరీతంగా పెట్రో ధరలు పెంచుతున్నా, నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా నిలదీసే నాయకుడు లేకుండా పోయారు. అందుకే దేశంలో విపక్షం అన్న దానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీల నేతలకు పెద్దగా సత్తా కానరావడం లేదు. అలాగే రాహుల్ గాంధీ కూడా మోడీ ముందు ఆనడం లేదు. తెలంగాణ సిఎం కెసిఆర్ అస్త్ర సన్యాసం చేశారు. మోడీకి వ్యతిరేకంగా తాను అందరీని ఏకతాటిపైకి తీసుకుని వస్తానని ప్రకటించి వెనక్కి తగ్గారు. కెసిఆర్ బలహీనతలు కూడా బిజెపికి, మోడీకి కలసి వచ్చాయనే అనుకోవాలి. అవసరాన్ని బట్టి టిఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషిస్తుందని ఇటీవల కెటిఆర్ ప్రకటించినా అంతటి పరిస్థితి ఉందా అన్నదే అనుమానం. ఇకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పెద్దగా ప్రశ్నించేవారు కనపడడం లేదు. అడపాదడపా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్లకు, వామపక్షాలు విడుదల చేసే ప్రకటనలకు మోడీ పెద్దగా స్పందించడం లేదు. బిజెపిలో కూడా మరో బలమైన నాయకుడు కనిపించడం లేదు. అలావుండివుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇంత బలహీనంగా ఉండేది కాదు. అంటే మోడీ చేతుల్లో ఉన్నంత వరకే బిజెపి బలంగా కనిపిస్తుంది. మోదీ లాంటి నాయకుడు లేడని జబ్బలు చరచుకోవడం గతంలో ఉన్న బిజెపిలో ఎప్పుడూ కానరాదు. వాజ్‌పేయి,అద్వానీల సమయంలో కూడి ఇంతగా పొగడ్తలు, వ్యక్తి ఆరాధనలు బిజెపిలో కానరలేదు. మోడీ, అమిత్‌షా ద్వయం తమ బలాన్ని, అధికారాన్ని మరింతగా పెంచుకుని దేశంలో విపక్షం అన్నది లేకుండా చేసేక్రమంలో క్రమంగా విజయం సాధించడం వెనక బలపమైన ప్రతిపక్షం లేకపోవడమే అని గుర్తించాలి. అందుకే వారిద్దరూ దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని రకాల వ్యూహాలూ అవలంబి స్తున్నారు. ధరలు పెరిగినా పెద్దగా పట్టించుకోవడం లేదు. పెట్రో దరల మంటపెడుతున్నా, గ్యాస్ ధరలు వింటే గుండెపోటు వస్తున్నా పట్టించుకోవడం లేదు. పార్టీలో మరో బలమైన నేతల ఉంటే ఈ పరిస్థితి బిజెపి పార్టీకి ఉండేది కాదు. దేశంలో ప్రత్యర్థులు బలహీనంగా ఉన్న ఏ ప్రాంతాన్నీ బిజెపి వదులు కోవడానికి ఇష్టపడకపోగా, కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు నిత్యం ప్రయత్నిస్తోంది. నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రతరం అయిందని వపిక్షనేతలంతా భావిస్తున్నారు. ఇదే అదనుగా ప్రజలు ప్రత్యామ్నాయంగా తమ వైపు చూస్తారన్న ఆశాభావంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నిజానికి మోదీ అనేక ప్రజా వ్యతిరేక, నిరంకుశ నిర్ణయాలు తీసుకు న్నారనడంలో సందేహం లేదు. వివిధ వర్గాల ప్రజలు తీవ్ర నిరసనను కూడా వ్యక్తపరిచారు. నెలల తరబడి ఆందోళనలను నిర్వహించారు. మేధావులు, ప్రజాస్వామికవాదులలో కూడా మోదీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. పెట్రోల్, డీజిల్‌తో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి. నిరుద్యోగం పెచ్చరిల్లిపోయింది. మోదీ ప్రభుత్వ విధానాల పట్ల ప్రతిపక్షాల్లో మాత్రమే కాదు స్వపక్షాల్లో కూడా చర్చ జరుగుతోంది. అయినప్పటికీ ఈ ప్రజావ్యతిరేకతను పూర్తిగా తమ వైపుకు మళ్లించగల శక్తి, నాయకత్వం దేశంలో ప్రస్తుతమున్న పార్టీలకు, నేతలకు లేదని నిరూపితం అయ్యింది. 2009కి పూర్వం కాంగ్రెస్
నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం పట్ల ఏర్పడిన తీవ్ర ప్రజావ్యతిరేకతను, కుంభకోణాలను బిజెపి పూర్తిగా తన వైపుకు తిప్పుకోగలిగింది. అంతకు ముందు రెండు సార్లు ఆడ్వాణీని ప్రయోగించి విఫలమైన బిజెపి నాయకత్వం నరేంద్రమోదీని రంగంలోకి దించి ఒక ఊపును నిర్మించగలిగింది. బిజెపికి హిందూత్వ సైద్దాంతిక ప్రాతిపదిక, సంస్థాగత పటిష్ఠత, ఆర్‌ఎస్‌ఎస్ తోడ్పాటు కారణంగా మోదీ నిర్ణయాలు కొన్ని కలసి వచ్చాయి. అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి హిందుత్వ వాదులు సిద్దంగా లేరు. ఇదే మోడీకి కూడా బాగా కలసి వస్తోంది. మోడీకి వ్యక్తిగత ప్రాబల్యం, ఓట్లను కులాలవారీగా, వర్గాలవారీగా చీల్చగలిగిన వ్యూహరచన కలసి వస్తోంది. వివిధ ప్రభుత్వ యంత్రంగాలను ఉపయోగించి ప్రత్యర్థులను భయభ్రాంతుల కు గురి చేయగలిగిన శక్తి తోడ్పడుతోంది. శరద్ పవార్ లాంటి వారు కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్విని యోగం అవుతున్నాయని ఆరోపించారు. ఇకపోతే పశ్చిమ బెంగాల్‌లో ఒక్క మమతా బెనర్జీ తప్ప దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపిని నేరుగా ఢీకొనేందుకు ధైర్యాన్ని ప్రదర్శించలేక పోతున్నాయి. బిజెపి గ్రాఫ్ పడిపోతుందని, ఓటమి దిశన పయనిస్తుందని సంకేతాలు వస్తే కాని అనేక ప్రతిపక్షాలు నేరుగా బిజెపిని ఢీకొనేందుకు సిద్దపడకపోవచ్చు. చంద్రబాబు లాంటి వారు మోడీని ఢీకొనాలని చూసి కోలుకో కుండా పడిపోయారు. ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత ఓట్లుగా మారితే బిజెపి గాలిలో కొట్టుకుపోవచ్చు కాని ప్రతిపక్షాల ఓట్ల చీలిక భారతీయ జనతా పార్టీ కే ఉపయోగపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే అంతమాత్రాన బిజెపి తనకు తిరుగులేదని అనుకోవడానికి లేదు. ప్రజావ్యతిరేకత ఎక్కడ ఏ రూపంలో అయినా రావచ్చు.. వ్యతిరేకతల నుంచే నాయకుడు రావచ్చు. వచ్చే రెండేళ్లలో భారతీయ జనతాపార్టీ 16 రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నది. అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఆ తర్వాత 2024లో సార్వత్రక ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది రాజకీయంగా కీలకమైన రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో యథాప్రకారం భారీ మెజారిటీతో యోగి మరోమారు విజయం సాధించకపోతే బిజెపికి ఎదురుదెబ్బలు తప్పవు. ఇప్పటికే యూపిలో యోగికి వ్యతిరేకంగా ఉద్యమిస్తు న్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలుల్లో అనైక్యత ఉన్నంత కాలం మోడీని ఢీకొనడం సాధ్యం కాదని గుర్తించాలి.