విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మరు: మంత్రి జోగు
ఆదిలాబాద్,జూన్30(జనం సాక్షి): మంత్రి జోగు రామన్న ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గుడిహత్తునూర్ మండల కేంద్రంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండలప్రజా పరిషత్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేని వారే విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు నమ్మరని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టి రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారన్నారు. ఎన్నికలు సవిూపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ మేము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఉచిత హావిూలు ఇస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నపుడు ప్రజలను పట్టించుకోని పార్టీలు ఇప్పుడు అధికారం కావాలని అడగడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరో 20 సంవత్సరాలు సీఎంగా కేసీఆర్ కొనసాగుతారన్నారు.