విమోచనను అవహేళన చేయరాదు: బిజెపి
వరంగల్,సెప్టెంబర్13(జనంసాక్షి):విమోచనను అవహేళన చేస్తున్న టిఆర్‌ఎస్ భవిష్యత్‌లో ప్రజలకు సమాధానం చెప్పుకోక తప్పదని బిజెపి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. సిఎం కెసిఆర్ తక్షణం
విమోచన దినోత్సవంపై అధికారిక ప్రకటన చేయాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే తెరాస పాటిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాలనను గాలికి వదిలేశారన్నారు. ప్రభుత్వం మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం హేయమైన చర్య అని ఆరోపించారు. తెలంగాణలో భాజపా అధికారంతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని పేర్కొన్నారు. నిజాం పరిపాలన భేష్ అన్న వారు సెప్టెంబరు 17ను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు.తెలంగాణ
ఇచ్చింది ముమ్మాటికీ తమ పార్టీయేనంటూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంతోనే సామాజిక తెలంగాణ సాధన సాధ్యమన్నారు. రాష్ట్రంలో తెరాస పాలన కాంగ్రెస్ దారిలోనే సాగుతుందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెరాస పూర్తిగా విఫలమైందన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా భాజపాను ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.