విలక్షణ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత


అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
ముంబై,ఆగస్ట్‌9(జనంసాక్షి): విలక్షణ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అవయవాల వైఫల్యంతో మృతి చెందారని శ్యామ్‌ స్నేహితుడు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు. అనుపమ్‌ మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’తో పాటు పలు టీవీ సీరియల్స్‌తో పాటు స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, బందిపోటు క్వీన్‌ తదితర చిత్రాల్లో నటించారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన సబర్బన్‌ గోరేగావ్‌లోని లైఫ్‌లైన్‌ ఆసుప్రతిలో చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి కన్నుమూశారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ నట జీవితంలో శ్యామ్‌ ’సత్య, దిల్‌ సే, లగాన్‌, హజారోన్‌ ఖ్వైషేన్‌ ఐసీ’వంటి చిత్రాలతో నటించారు. ’మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’ సీరియల్‌లో ఠాకూర్‌ సజ్జన్‌ సింగ్‌ పాత్ర పోషించిన ఆయన.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2009లో ప్రసారమైన ఈ సీరియల్‌.. సెకండ్‌ సీజన్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. గతేడాది సైతం అనుపమ్‌ శ్యామ్‌ అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్‌ చేయించిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆసుప్రతిలో చేర్పించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వైద్య సహాయానికి ఆర్థిక సహకారం అందించాలని అభ్యర్థించారు. ఆ తర్వాత కోలుకున్న ఆయన.. మరోసారి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుప్రతిలో చేరి.. చికిత్స పొందుతూ మృతి చెందడంతో బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో విషాదం అలుముకున్నది.