విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 26 (జనంసాక్షి) సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేసిన గ్రామాలను పంచాయతీలుగా కొనసాగించి అర్బన్ మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించిన నాయకులు ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలతో ప్రమేయం లేకుండా సిరిసిల్ల మున్సిపల్ లో తమ గ్రామాలను విలీనం చేసి నిర్లక్ష్యానికి వదిలేసారని ఆరోపించారు. మరోవైపు ఉపాధి హామీ పనులు కూడా లేకపోవడంతో గ్రామాల్లోని నిరుపేదల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ కలుగజేసుకుని గ్రామపంచాయతీలను కొనసాగిస్తూ అర్బన్ మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు కోరడంతో ఆందోళన విరమించారు. నిరసన కార్యక్రమంలో చిన్నమనేని కమలాకర్ రావు, బోల్గమ్ నాగరాజు గౌడ్, గంభీరావుపేట్ ప్రశాంత్, మంగ కిరణ్, లింగంపల్లి మధుకర్ పలువురు విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.