విలీన మండలాల బాకీలపై ఎపి సర్కార్‌ నిర్లక్ష్యం

ఖమ్మం,జూన్‌29(జనం సాక్షి ): విభజన తరవాత ఏడుమండలాల విలీనంతో ఖమ్మం డీసీసీబీ పరిధిలోనిరెండు బ్రాంచ్‌లు, ఏడు సొసైటీలు ఆంధ్రా రాష్ట్రంలో వెళ్లిపోయాయని డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు అన్నారు. దీంతో ఆయా సొసైటీల నుంచి రావాల్సిన రూ.14 కోట్లు నిలిచిపోయాయన్నారు. రుణాలకు సంబంధించిన పరిస్థితి ఆంధ్రా సర్కార్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో తొలిసారిగా రైతాంగం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల ఆరోగ్యం మెరుగుదల కోసం ప్రత్యేక వైద్యశాల ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఉచిత భూసార పరీక్షల కోసం ప్రత్యేక భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి సాయిల్‌ హెల్త్‌కార్డులను అందించడం జరిగిందన్నారు. డీ మానిటేషన్‌ తర్వాత నగదు కొరత రాకుండా ఉండేందుకు గాను ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నాల్గవ విడత రుణమాఫీ నిధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకాలంలో రైతులకు అట్టి నిధులను అందజేయడం జరిగిందన్నారు. యంగ్‌ చాంపియన్‌, రూపేకార్డులు, పంట రుణాల రికవరీ తదితర పథకాల అమలులో దేశంలోనే ఖమ్మం డీసీసీబీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అనేక అభివృద్థి పథకాలు, సమాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. పాలకవర్గం ఏర్పడే నాటికి డీసీసీబీ పరిధిలో 30 బ్రాంచ్‌లు ఉండగా నేడు 50 బ్రాంచ్‌లకు చేరుకోగలిగామన్నారు. త్వరలోనే మరో 14 బ్రాంచ్‌లను ప్రారంభించుకునేందుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు.