వివేకా హత్య కేసులో బంధువులు, సన్నిహితులను విచారిస్తున్న సీబీఐ

అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు విచారణను వేగవంతం చేశారు. వైఎస్‌ కుటుంబ సభ్యుల బంధువులు, సన్నిహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్‌.అండ్‌.బి అతిథి గృహం కేంద్రాలుగా 68వ రోజు విచారణ కొనసాగుతోంది. వైద్యులు వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి, పులివెందులకు చెందిన వైసీపీ నాయకులు రఘునాథ్‌ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పలువురు అనుమానితుల పేర్లు పేర్కొనగా అందులో దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి కూడా ఉన్నారు. మరోమారు అభిషేక్‌ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో మరో సీబీఐ బృందం ఎదుట విచారణకు భరత్‌ యాదవ్‌ హాజరయ్యారు. నిన్న మాజీ డైవర్‌ దస్తగిరి, చెప్పుల వ్యాపారి మున్నా, ఈసీ గంగిరెడ్డి సోదరుడి కుమారుడు సురేంద్ర నాథ్‌ రెడ్డి ఎర్ర గంగిరెడ్డి, భరత్‌ యాదవ్‌ లను సీబీఐ అధికారులు విచారించారు. ఒక్కొక్కరిని ఐదు నుంచి ఆరు గంటల పాటు విచారించారు. వారిచ్చే సమాధానాలను రెవిన్యూ అధికారుల సమక్షంలో స్టేట్మెంట్‌ రికార్డు చేస్తున్నారు. నిన్న పులివెందుల కోర్టుకు వచ్చిన సునీల్‌ యాదవ్‌ న్యాయవాది యతీష్‌ రెడ్డి, బెయిల్‌ పిటిషన్‌ కోసం పత్రాలను తీసుకోనేందుకు వచ్చినట్లు సమాచారం. కస్టడిని పోడిగించాలంటూ సీబీఐ అధికారులు మెజిస్ట్రేట్‌ ను కోరారు. వాచ్‌ మెన్‌ రంగన్న ఇచ్చిన వాగ్మూలం ప్రకారం అధికారులు ఒక్కొక్కరిని విచారిస్తున్నారు.
హత్యకు ముందు, హత్య జరిగిన తర్వాత ఎవరెవరు వివేకా ఇంటికి వచ్చారో రంగన్న పూర్తి సమాచారం ఇచ్చారు. అన్ని కోణాల్లో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో హత్యకు ఉపయోగించిన ఆయుధాలపై ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్‌ నిపుణుల నివేదిక, పోస్టుమార్ట ఆధారంగా ఆయుధాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.