విశ్వాస పరీక్షలో ‘నితీశ్‌’ విజయం

అనుకూలంగా 126, వ్యతిరేకంగా 24
భాజపా బాయ్‌కాట్‌
పాట్నా, జూన్‌ 19 (జనంసాక్షి) :
బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ శాసనసభలో విశ్వాసం నిలబెట్టుకున్నారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయిన తర్వాత జేడీయూ అసెంబ్లీలో అవిశ్వాసానికి సిద్ధపడిరది. ఈ మేరకు అసెంబ్లీలో నితీశ్‌ ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. వ్యతిరేక ఓట్లన్నీ ఆర్జేడీయే కావడం గమనార్హం. ఎన్డీఏ నుంచి వైదొలగడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. దీంతో నితీశ్‌ సులువుగానే మెజార్టీని సాధించారు. ప్రభుత్వానికి కాంగ్రెస్‌, స్వతంత్ర సభ్యులు మద్దతుగా నిలిచారు. బీజేపీతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న జేడీయూ విశ్వాస పరీక్షకు సిద్ధపడిరది. సంకీర్ణ ప్రభుత్వంలోని 11 మంది మంత్రులను బర్తరఫ్‌ చేసిన నితీశ్‌కుమార్‌.. విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో బుధవారం ఆయన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది.
అంతకుముందు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. 2005లో ఆర్జేడీ ప్రభుత్వం ఓటమి తర్వాత బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవడం ఇదే తొలిసారి. అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేపీ నితీశ్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. ప్రభుత్వం అక్రమాల ద్వారా విశ్వాస పరీక్షలో నెగ్గుతుందని తెలిసే తాము వాకౌట్‌ చేశామని బీజేపీ శాసనసభాపక్ష నేత నందకిశోర్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజలను నితీశ్‌ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2015లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అతడికి ప్రజలే గట్టి బుద్ది చెబుతారని హెచ్చరించారు. 2010లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు నితీశ్‌ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ‘స్థానిక అభివృద్ధి నిధులను ఎమ్మెల్యేలకు కేటాయించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అయినా నా మాట లెక్కచేయకుండా విూరు (నితీశ్‌) నిధులు కేటాయించారు’ అని మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శాసనసభ్యులను దొంగలని విూరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విశ్వాస ఘాతుకాన్ని నిరసిస్తూ సభనుంచి వాకౌట్‌ చేస్తున్నామని ప్రకటించి బీజేపీ నేతలు వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులు వాకౌట్‌ చేసిన అనంతరం నితీశ్‌ మాట్లాడుతూ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. గుజరాత్‌ అభివృద్ధి మంత్రంపై విమర్శలు గుప్పించారు. ప్రకటనలకే రూ.5 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత మోడీదని, మోడీకి పాలన కంటే ప్రచారంపైనే మోజు ఎక్కువని విమర్శించారు. బీహార్‌లో బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా లేదన్నారు. ఎన్డీయే విధానాలను ఆ పార్టీ తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు జేడీయూను వంచించి, అద్వానీని కించపరిచారని విమర్శించారు. వారివి అవకాశ వాద రాజకీయాలని ఆరోపించారు. బీజేపీ శ్రేణులది ఉత్సాహమే తప్ప అది జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశమే లేదన్నారు. ఆ పార్టీతో విడిపోయిన తర్వాత బీహార్‌లో పూర్తిగా లౌకికవాద రాజ్యం ఏర్పడిరదని తెలిపారు. విభజన రాజకీయాలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీపై ధ్వజమెత్తిన నితీశ్‌ విభజనవాదిని జాతీయ నేతగా ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. లౌకికత్వ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధి పథంలో ప్రయనిస్తున్న నగరాలను మళ్లీ అభివృద్ధి చేసే ప్రణాళికలు ఎందుకని మోడీకి చురకలంటించారు. బీహార్‌ ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు.