*వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు*
మునగాల, జులై 29(జనంసాక్షి): ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు ఐదవ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, వీఆర్ఏలకు తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని వారిని తలెత్తుకుని తిరిగేలా వారికి జీతాలు పెంచుతామని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇస్తామని 55 సంవత్సరాలు నిండిన స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని ఇచ్చిన హామీలన్నీ నేటికీ అమలు చేయకపోవడంతో సమ్మెకు దిగారని వారు అన్నారు. తమ సమస్యల సాధన కొరకు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేసినట్లు వారు తెలిపారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాట మార్గంగా ముందుకు సాగాలని, వారి సమ్మె విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కాసర్ల కోటేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొలిషెట్టి బుచ్చిపాపయ్య, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలే సామేల్, సింహాద్రి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.