వీడని సందిగ్ధత

– కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు కుదరని ముహూర్తం
– కీలక శాఖల మధ్య జేడీఎస్‌, కాంగ్రెస్‌ పట్టు
– బుధవారం కొలిక్కిరాని చర్చలు
బెంగళూరు, మే29(జ‌నం సాక్షి) : కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఇంకా కుదరకపోవడానికి కారణం ఏమిటి? సీఎం కుమారస్వామి, కాంగ్రెస్‌ నేతల మధ్య తరచు చర్చోపచర్చలు జరుగుతున్నా అంగీకారానికి రాలేకపోతున్న పోర్ట్‌ఫోలియోలు ఏమిటనేవి ఇప్పుడు చర్చనీయాంశాలవుతున్నారు. సీఎంగా కుమారస్వామి, ఉపముఖ్యమంత్రిగా జి.పరమేశ్వర్‌ ప్రమాణస్వీకారం చేసి వారం రోజులవుతున్నా మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న జాప్యానికి కీలక పదవుల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడమే కారణమని
తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తమ కోటా కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పట్టుబడుతోందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన జి.పరమేశ్వర్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక కీలకమైన ఆర్థిక శాఖ విషయంలోనూ కాంగ్రెస్‌ పట్టుబడుతోందట. అయితే ఈ విషయంలోనూ జేడీఎస్‌ బెట్టుగా ఉంది. ఆర్థిక శాఖ జేడీఎస్‌కు లేకుంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కుమారస్వామి ఎలాంటి పథకాలు కానీ, ఎన్నికల హావిూలు కానీ నెరవేర్చలేని పరిస్థితి ఎదురుకావచ్చని ఆ పార్టీ వాదనగా ఉంది. ఆర్థిక శాఖతో పాటు పీడబ్ల్యూడీ, ఇంధన శాఖలు కూడా తమకే ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉంటుందనుకున్న మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమై అవకాశం ఉందని తెలుస్తుంది. సోనియాగాంధీ వైద్యపరీక్షల కోసం తోడుగా రాహుల్‌ గాంధీ వెళ్లడంతో ఆయన తిరిగి రాగానే..అంటే మరో వారంలోపే మంత్రివర్గ విస్తరణ ఉండచ్చని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘చర్చలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ఓ మంచి ముగింపు వస్తుంది. సాధ్యమైనంత త్వరలోనే అన్ని అంశాలపై స్పష్టత ఏర్పడుతుంది అని కుమారస్వామి విూడియాకు తెలిపారు.