వీరిది మూన్నాళ్ల ముచ్చటే

ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదన్న యెడ్యూరప్ప
బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): కుమారస్వామి ప్రభుత్వం ఎంతోకాలం నిలవదని, ఇది మూన్నాళ్‌ ముచ్చటేనని మాజీ సిఎం యెడ్యూరప్ప జోస్యం చెప్పారు.  కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి మరికొద్ది గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారనగా ఆయన విూడియాతో మాట్లాడారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో కాంగ్రెస్‌ మద్దతుతో జేడీఎస్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తోంది. అధికార దాహమే ఆ పార్టీలను కలిపిందని దుయ్యబట్టారు. కుమారస్వామి ప్రమాణస్వీకారం నేపథ్యంలో భాజపా నిరసన దినం చేపట్టింది. యడ్యూరప్ప దీనికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేస్తోంది. అధికార దాహం, దురాశే కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి ప్రధాన కారణాలు. ఇలాంటి కూటమి ఎంతోకాలం నిలవదు. ఈ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదు.’ అని యడ్డీ ఎద్దేవా చేశారు. కర్ణాటక అసెంబ్లీలో 104 స్థానాలను సాధించి భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు మాత్రం స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయినప్పటికీ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని యడ్యూరప్ప గవర్నర్‌ను కోరారు. అలా ఈ నెల 17న యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన మెజార్టీ లేకపోవడంతో రెండు రోజులకే యడ్డీ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చాయి. ఇందుకు గవర్నర్‌ అనుమతించడంతో కుమారస్వామి నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.