వీర జవాన్లకు జోహార్లు

వృద్ధులు, రోగులకు తరలింపులో తొలి ప్రాధాన్యం
తుది వరకూ సహాయక చర్యలు : షిండే
ఉత్తరాఖండ్‌/న్యూఢల్లీి, జూన్‌ 28 (జనంసాక్షి) :
ప్రతికూల పరిస్థితుల్లో బాధితులకు ఎనలేని సేవలందించిన వీర జవాన్లకు శెల్యూట్‌.. అని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌షిండే అన్నారు. డెహ్రాడూన్‌కు శుక్రవారం ఉదయం ఆయన చేరుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఉన్నారు. పునరావాస, సహాయక చర్యలను సమీక్షించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో అశువులు బాసిన అమరసైనికులకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ సీఎం విజయబహుగుణ కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో షిండే మాట్లాడారు. బదరినాధ్‌లో ఇంకా 2,700మంది చిక్కుకునిపోయారన్నారు. చిక్కుకునిపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బదరీనాధ్‌లో హెలికాప్టర్లు దిగే అవకాశం లేకపోవడంతో సైనికులు కొండలు, గుట్టలు మీదుగా.. ప్రత్యేక రోడ్ల మీదుగా తరలిస్తున్నారన్నారు. తమ సెలవులను కూడా రద్దు చేసుకుని సేవలందిస్తున్న సైనికులను అభినందిస్తున్నానన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి నేటి వరకు సహాయక చర్యల్లో తలమునకలై ఉన్న సైనికులే నిజమైన హీరోలన్నారు. ఆపదల్లో చిక్కుకున్న యాత్రికుల పాలిట ప్రాణదాతలుగా నిలిచారన్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఉత్తరాఖండ్‌ పునర్‌ నిర్మాణానికిగాను కేంద్ర పర్యాటక శాఖ 196 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పునరావాస చర్యలు కొనసాగుతున్నాయన్నారు. యాత్రీకుల తరలింపులో కొన్ని విషయాలను పాటించామన్నారు. తొలుత వృద్ధులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తరలించేందుకు ప్రాధాన్యమిచ్చారన్నారు. ఆ తర్వాత మహిళలను.. ఆ తర్వాత మిగిలిన వారిని తరలించేలా ప్రణాళికతో నడుచుకున్నామన్నారు. ఇంకెన్ని శవాలు గుట్టలు కింద.. బురదలో ఉన్నాయో తెలీడం లేదన్నారు. అంటు వ్యాధులు ప్రబలకంగా సైనికులు ఆ ప్రాంతాల్లో రసాయనాలు చల్లుతున్నారని తెలిపారు.
హర్సిల్‌లో కూలిన హెలికాప్టర్‌
హర్సిల్‌ వద్ద సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న హెలికాప్టర్‌ శుక్రవారం ఉదయం కూలింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, బదిరీనాథ్‌లో 2700 మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నారు. శుక్రవారంనాడు వాతావరణం మామూలుగా ఉన్నప్పటికీ బదిరీనాథ్‌లో హెలికాప్టర్‌లో దిగే అవకాశం లేకపోవడంతో వారిని హరిద్వార్‌కు తరలించేందుకు సైనికులు కృషి చేస్తున్నారు. కేదార్‌నాథ్‌లో గురువారంనాడు 18 మృతదేహాలకు దహన సంస్కారం నిర్వహించగా శుక్రవారం మరికొంత మందికి నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. వారి ఫోటోలను, డిఎన్‌ఎలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రెండు వారాల్లో కేదార్‌నాథ్‌లో పూజలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించేందుకు అర్చకులు, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.