వృక్ష సంపదపైనే మనిషి మనుగడ

నల్గొండ, జూలై 31 : వృక్ష సంపదపైనే మనిషి మనుగడ ఆధారపడి వుందని నల్లగొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. 63వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై జిల్లా కలెక్టర్‌ యన్‌. ముక్తేశ్వర రావుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, వృక్ష సంపద తరిగిపోయి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి తీవ్ర కరువుకు కారణం అవుతోందిన ఆయన విచారం వ్యక్తం చేసారు. ఒక్క రోజే 20 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం బాగున్నప్పటికీ నాటిన మొక్కలు ఎన్ని రక్షించబడుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. మొక్కలు నాటడంతోనే సరిపోదని, వాటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి ఏడు వృక్ష సంపద తరిగిపోయి భూమిపై ఆక్సిజన్‌ కొరతతో జీవరాసులు అంతరించి పోతున్నాయని అన్నారు. జిల్లాలో గత 10 సంవత్సరాలుగా వృక్ష సంపద తరిగిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇక్రిసాట్‌ సంస్థ పరిశోధన ప్రకారం రాబోయే రోజులలో ఉష్ణమండలంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న కారణంగా సగటు వర్షపాతం ఇప్పటికే నమోదైనట్లు కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో కేవలం 508 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉన్నందున ఇంకా 25శాతం సగటు వర్షపాతం తక్కువగా నమోదైనట్లు కలెక్టర్‌ అన్నారు. ఉద్యమ స్పూర్తితో మొక్కలు నాటి నల్లగొండను నందన వనంలో తీర్చిదిద్దాలని కోరారు. నల్లగొండ వన నేస్తాలుగా ఆరుగురిని గుర్తించి ప్రశంసా పత్రాలు, మొమెంటోలు వక్తృత్వ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు మొమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో సామాజిక అటవీ విభాగం అధికారి పురుషోత్తం, డిఇ.ఓ జగదీష్‌, ఆర్‌.ఐ.ఓ. భాస్కర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ గోనారెడ్డి, వ్యవసాయశాఖ జె.డి., బెటాలియన్‌ కుమాండెంట్‌ బాబ్జీరావు, జిల్లా పరిషత్‌ సి.ఇ.ఓ. కోటిరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పుల్లెంల వెంకటనారాయణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.