” వృత్తి భవన నిర్మాణరంగం… ప్రవృత్తి దొంగతనం… నిందితుడి అరెస్ట్ చోరీ సొత్తు సీజ్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 08( జనంసాక్షి): బ్రతకడానికి భవన నిర్మాణ రంగంలో మేస్త్రీగా పని చేస్తూ జల్సాలను అనుభవించడానికి దొంగతనాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్న ఓ వ్యక్తి పరిస్థితులు వికటించి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మాదాపూర్ జోన్ అడిషనల్ డిసిపి ఎన్. నరసింహారెడ్డి తెలియజేసిన ప్రకారం… మలిశెట్టి నరేష్(35) బ్రతుకుతెరువు నిమిత్తం గత 15 ఏళ్ల క్రితం కృష్ణాజిల్లా గంపలగూడెం నెహ్రూ చెరువు నుండి నగరానికి వచ్చి క్యాబ్ డ్రైవర్ గా స్థిరపడ్డాడు. తదనంతరం భవన నిర్మాణ రంగంలో మేస్త్రి గా పని చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో కూలి డబ్బులు మద్యానికి సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై 2011 లోనే మొబైల్ దొంగతనం కేసు నమోదు కావడం గమనార్హం. జైలుకు వెళ్లొచ్చినా బుద్ధి మారకపోవడంతో తిరిగి దొంగతనాలను చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబరు చివరి వారంలో ఓ పల్సర్ బైక్ ను దొంగిలించి రెండు రోజులపాటు నెంబర్ ప్లేట్ మార్చి దానిపై తిరిగాడు. అయినా ఎవరికి పెద్దగా అనుమానం రాకపోవడంతో గత నెల 29వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ పుస్తెలతాడును తెంపుకొని పారిపోయాడు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు పాత నేరస్తుల చిట్టాను బయటకు తీసి అనుమానితులపై నిఘాను పెంచగా మలిశెట్టి నరేష్ పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా పల్సర్ బైక్ దొంగతనాన్ని, చైన్ స్నాచింగ్ కేసును అంగీకరించడంతో నిందితుడిని శనివారం రిమాండ్ కు తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టగా ఏసిపి కృష్ణ ప్రసాద్, మియాపూర్ ఇన్స్పెక్టర్ ఎన్. తిరుపతిరావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కాంతారెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.