వృద్దురాలిపై దాడి: నగలు దోపిడీ
మచిలీపట్నం,జూలై6(జనం సాక్షి): మచిలీపట్నంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మచిలీపట్నం – విజయవాడ రోడ్డులోని ఓ ఇంట్లో వృద్ధురాలు లక్ష్మీనర్సమ్మపై దొంగలు దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు.. వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. వృద్ధురాలి నుంచి 12 కాసుల\బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 4 బంగారు గాజులు, మెడలోని నగలను దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి రూ.1.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బలరాముని పేటలో లక్ష్మీ నరసమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆ పక్క పోర్షన్‌లోనే ఆమె కుమారుడి కుటుంబం నివసిస్తోంది. గురువారం రాత్రి స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన ఆమెపై అప్పటికే అక్కడ పొంచి ఉన్న గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, గాజులు దోచుకుపోయారు. కేసు నమోదు చేసిన ఆరపేట పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.