వృద్దురాలి నగల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
తెలిసిన వారే దొంగతనానికి ఒడిగట్టారు: ఎస్పీ
మచిలీపట్నం,జూలై9(జనం సాక్షి): ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దౌర్జన్యం చేసి బంగారు నగలు అపరించుకు పోయిన కేసులో ముగ్గురు నిందితులను మచిలీపట్నం అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ చోరి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆమె గురించి బాగా తెలిసిన వారే ఈ చోరీ చేసివుంటారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగింది. మచిలీపట్నం బలరామునిపేటలో లక్ష్మీ నరస్సమ్మ అనే వృద్ధురాలు కుమారులతో కలిసి నివాసముంటోంది. ఈ నెల 5న నరసమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి బంగారు నగలను అపహరించారు. దోపిడీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు.. నరసమ్మ కుమారుడితో సన్నిహితంగా ఉండే ఓ మహిళ మరో ఇద్దరితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్దారించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.