వెంకటయ్య సేవలు భేష్‌

4

– పనిని ప్రేమించాడు

– మురికి వదిలించాడు

– అభినందించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఆగస్టు 4(జనంసాక్షి): దేశంలోనే ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన టీ వెంకటయ్యను మంత్రి కేటీఆర్‌ సన్మానించారు. టీ వెంకటయ్యకు ఇవాళ మంత్రి కేటీఆర్‌ రూ. 2,11,111 చెక్కును అందజేశారు. వెంకటయ్య గత 16ఏళ్ల నుంచి ఎలాంటి సెలవులు తీసుకోకుండా పారిశుద్ధ్య కార్మికుడిగా నిర్విరామంగా సేవలందించారని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ లో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. వెంకటయ్య సేవలను గుర్తించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆయనను దేశంలోనే ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపిక చేసిందని ట్వీట్‌ చేశారు.ఈ కార్యక్రమంలో జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొన్నారు. మన పని మనం చేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుందనేది పెద్దలు చెప్పే సత్యం…అలా తన పని తాను చేసుకుపోతూ, తాను చేస్తున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో…  వెంకటయ్యకి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. విధి నిర్వహణలో చిత్తశుద్ధి…. క్రమం తప్పకుండా తన పనికి హాజరవ్వడం…సెలవులని సైతం వినియోగించుకోకుండా పనినే ఆనందంగా భావించే తూముకుంట వెంకటయ్య అనే కార్మికుడికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని బాబుల్‌ రెడ్డినగర్‌, రాఘవేంద్ర కాలనీల్లో 16 ఏళ్లుగా శానిటేషన్‌ కార్మికుడిగా పనిచేస్తున్నారు. సెలవుల్లో సైతం పనిని చేస్తూ స్థానికుల ప్రశంసలతో పాటు జాతీయ స్వచ్చ సర్వేక్షణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఇద్దరిని మాత్రమే ఎంపిక చెయ్యగా కోయంబత్తూరు నుంచి నాగరాజు మొదటి వ్యక్తిగా ఎంపికయ్యారు. రెండో వ్యక్తిగా జీహెచ్‌ఎంసీకి చెందిన వెంకటయ్య ఎంపికయ్యారు. ఈనెల 6వ తేదీన ప్రధాని చేతుల విూదుగా అవార్డు అందుకోనున్నారు. జాతీయస్థాయి అవార్డు రావడంపై వెంకటయ్య హర్షం వ్యక్తం చేశారు.

వెంకటయ్యపై అధికారులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా శానిటేషన్‌ కార్మికులకు చెడువ్యసనాలు ఉంటాయని కాని వెంకటయ్య వాటన్నింటికీ దూరంగా ఉంటారని చెబుతున్నారు. ఇటీవలే జీహెచ్‌ంసీ ప్రవేశపెట్టిన తడిచెత్త, పొడి చెత్త కార్యక్రమాన్ని వెంకటయ్య సక్సెస్‌ చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. జాతీయ అవార్డుకు ఎంపికైన వెంకటయ్యను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి సన్మానించారు. పారిశుధ్య పనులు చేసే తమకు ఇలాంటి గుర్తింపు రావడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రోత్సహిస్తే ఇంకామెరుగైన సేవలు అందిస్తామని చెబుతున్నారు.