వెంకట్‌రెడ్డికి షోకాజ్‌

3

– డోంట్‌కేర్‌: కొమటిరెడ్డి

హైదరాబాద్‌,జూన్‌ 5(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేత, నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా ఇతర నేతల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై వారంలోగా వివరణ ఇవ్వాలని కోరింది.శనివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల కంటే ఉత్తమ్‌ ఎంపిక అధ్వానమని విమర్శించారు. ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి ఓటమికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కారణమని ఆరోపిస్తూ పలు విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

షోకాజ్‌ నోటీసులు లెక్కచేయను: వెంకటరెడ్డి

టీపీసీసీ పంపిన షోకాజ్‌ నోటీసులను తాను లెక్కచేయనని కాంగ్రెస్‌ నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పీసీసీకి షోకాజ్‌ నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు. ఉత్తమ్‌కి పీసీసీ ఇచ్చినందుకు పార్టీ నామరూపం లేకుండా పోతుందని విమర్శించారు. ఈ విషయాన్ని 16 మాసాల కిందటే తాను చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎవ్వరికీ సరైన గౌరవం ఇవ్వరని, నల్గొండ జిల్లాలో జానారెడ్డి, పాల్వాయి, ఉత్తమ్‌ కంటే తానే సీనియర్‌ నేతనని తెలిపారు. తాను తెరాసలో చేరుతానని చెప్పలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా వెంకటరెడ్డి పేర్కొన్నారు.