వెంట్రుక వాసిలో అధికారం కోల్పోయాం
– 1.1 శాతం ఓట్ల తేడా మాత్రమే
– డీఎంకే చీఫ్ కరుణానిధి
చెన్నై,మే22(జనంసాక్షి):తమిళనాడులో స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తెలిపారు. తమ పార్టీకి, అధికార అన్నాడీఎంకేకు మధ్య ఓట్ల తేడా 1.1 శాతం మాత్రమేనని ఆయన వెల్లడించారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు.తమ పార్టీ కంటే అన్నాడీఎంకే కు 4,41,646 ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలకు 1,76,17,060 ఓట్లు రాగా, డీఎంకే కూటమికి 1,71,75,374 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. కేవలం 1.1 శాతం ఓట్ల స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని, ఇది వాస్తవమని కరుణానిధి ఒక ప్రకటనలో తెలిపారు.172 స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్య ¬రా¬రీ పోటీ జరగ్గా డీఎంకే 89, అన్నాడీఎంకే 83 సీట్లు గెలిచాయన్నారు. కాంగ్రెస్, ఐయూఎంఎల్ సహా తమ కూటమిలో ఉన్న పార్టీలు పోటీ చేసిన 60 స్థానాల్లో అన్నాడీఎంకే 51 సీట్లు కైవసం చేసుకుందని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ప్రజలు తమకు మద్దతు పలికారని అన్నారు. అయితే మిత్రపక్షాలను తాము తప్పుబట్టడం లేదన్నారు. డీఎంకే కూటమి మొత్తం 98 సీట్లు గెలవగా కరుణానిధి పార్టీ 89, కాంగ్రెస్ 8, ఐయూఎంఎల్ ఒక్క సీటు దక్కించుకున్నాయి.