వెనక్కి వచ్చేయ్‌.. మంత్రి పదవి ఇస్తాం

– బీసీ పాటిల్‌తో యడ్యూరప్ప సంభాషణ
– ఆడియో టేపులను విడుదల చేసిన కాంగ్రెస్‌
– వరుస ఆడియో టేపులతో బీజేపీలో కలవరం రేపిన కాంగ్రెస్‌
బెంగళూరు, మే19( జ‌నం సాక్షి) : కర్ణాటకలో బలపరీక్షకు ముందు బీజేపీ ఆడియో టేపుల వ్యవహారం కలకలం సృష్టించింది. శుక్రవారం గాలి జనార్దన్‌రెడ్డి ఆడియోటేను విడుదల చేసిన కాంగ్రెస్‌, శనివారం యడ్యూరప్ప కుమారుడుతో పాటు యడ్యూరప్ప కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోబపరుస్తూ మాట్లాడిన ఆడియోటేపులను కాంగ్రెస్‌విడుదలచేసింది. దీంతో బీజేపీ ప్రలోబాలను కాంగ్రెస్‌ ప్రజల ముందు బట్టబయలు చేసినట్లయింది.  ఏకంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప తమ ఎమ్మెల్యేతో మాట్లాడిన సంభాషణలను విడుదల చేయటం సంచలనంగా మారింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌తో యడ్యూరప్ప మాట్లాడినట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆడియో టేపును విడుదల చేసింది. కాంగ్రెస్‌ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఆడియోను పోస్ట్‌ చేశారు. బీసీ పాటిల్‌, యడ్యూరప్ప మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది..
యడ్యూరప్ప :  హలో.. హలో.. ఎక్కడున్నావ్‌.. ఎక్కడున్నావ్‌..
బీసీ పాటిల్‌ : మేము బస్సులో కొచ్చి వెళ్తున్నాం..
యడ్యూరప్ప : కొచ్చి వెళ్లకు.. ఇక్కడికి వచ్చేయ్‌.. మంత్రి పదవి ఇస్తాం. మాట్లాడుదాం. వెనక్కి వచ్చేయ్‌.
బీసీ పాటిల్‌ : మొదటే నాకు చెప్పి ఉంటే బాగుండేది.. ఇప్పుడు బస్సులో ఉన్నాం.
యడ్యూరప్ప : ఏదో కారణం చెప్పి వెనక్కి వచ్చేయ్‌. ఇంట్లో వాళ్లకు సమస్య ఉందని చెప్పి వెనక్కి వచ్చేయ్‌.
బీసీ పాటిల్‌ : ఇక ముందు నా పొజిషన్‌ ఏంటీ?
యడ్యూరప్ప : నువ్వు మంత్రి అవుతావు.
బీసీ పాటిల్‌ : నాతోపాటు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు.
యడ్యూరప్ప : నీ వెంట ఉన్నవాళ్లను పిలుచుకొని రా.. నాపై విశ్వాసం ఉంది కదా?. ఒకసారి నువ్వు కొచ్చి వెళ్తే ఇక దొరకవు. ఇప్పుడు ఏం చేస్తావ్‌ చెప్పు.
బీసీ పాటిల్‌ : ఐదు నిమిషాల్లో విూకు ఫోన్‌ చేసి చెబుతా.
యడ్యూరప్ప : శ్రీరాములుకు ఫోన్‌ చేసి చెప్పు. అంటూ  యడ్యూరప్ప ఫోన్‌లో మాట్లాడినట్లు కాంగ్రెస్‌ ఆడియో టేపును విడుల చేసింది. ఈ టేపులు జాతీయ, ప్రాంతీయ ఛానెళ్లలో ప్రసారం కావటంతో బీజేపీలో ఒక్కసారిగా కలకలం రేకితెచ్చింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా మందలించినట్లు సమాచారం.