వేడెక్కుతున్న ఊరూవాడలు
తెలంగాణ పల్లెలు ప్రత్యేక నినాదంతో మరోసారి వేడెక్కుతున్నయి. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చినా, డీజీపీ దినేష్ రెడ్డి మాత్రం అనుమతి లేదన్నరు. రెండు నెలల కిందటే మార్చ్‌కు నిర్ణయించి ఉంటే ముందే ఎందుకు అనుమతి తీసుకోలేదని డీజీపీ ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ తెలంగాణ నాయకులు కూడా డీజీపీని కలిసి మార్చ్‌కు అనుమతినివ్వాలని, ఎలాంటి హింసకు తావులేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇక్కడ హింసకు తావుందని పోలీసులు వాదించడం కేవలం మార్చ్‌కు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయం, తెలంగాణ గడ్డపై తెలంగాణ వారిని అణగదొక్కుతున్నారన్న విమర్శలను మూటగట్టుకోవడం తప్ప మరోటి కాదు. మార్చ్‌కు అనుమతినిచ్చి శాంతి భద్రతలకు భంగం లేకుండా చూసుకుని ఉంటే బాగుండేది. కానీ, అలా కాకుండా కేవలం అణచివేత ధోరణితో వ్యవహరించడమే సరికాదు. అధికారం ఉందని నిషేధాలు విధించడం భావ్యం అనిపించుకోదు. సకల జనుల సమ్మె ముగిసి ఏడాది పూర్తయ్యాక, ఇప్పుడు మార్చ్‌కు మళ్లీ నేతలంతా సిద్ధం కావడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమం మరోమారు భగ్గుమననుంది. తెలంగాణ మార్చ్ జరిపేందుకు పొలిటికల్ జేఏసీ నిర్ణయించడంతో ఇక దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఇప్పటికే తెలంగాణవాదులు జిల్లాల నుంచి రాజధాని వైపు పరుగులు తీస్తున్నారు. ఊరూవాడా ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. చలో హైదరాబాద్ అంటూ పల్లెలు మార్మోగుతున్నయి. ఈ దశలో అనుమతి పేరుతో అణచివేత ధోరణి తీసుకోవడం సర్కార్‌కు తగదు. లేదా మార్చ్‌లో నక్సలైట్లు పాల్గొంటారని చెప్పడం కూడా సరైన విధానం అనిపించుకోదు. రాష్ట్రంలో నక్సలైట్లు లేరని నివేదికలు సమర్పించుకుంటున్న పోలీసు అధికారులు, ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం కూడా తెలివిమంతం అనిపించుకోదు. మరోవైపు చలో హైదరాబాద్ కార్యక్రమం కోసం ఊరూరా ప్రజలు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దరిదాపుల్లో ఉన్నదనే అభిప్రాయం తెలంగాణ వారిలోనే కాదు, ఆంధ్ర వారిలోనూ ఏర్పడటం విశేషం. ఆంధ్ర ప్రజలు మొదటి నుంచి విభజనకు అనుకూలంగానే ఉన్నారు. ఇటీవలి వరకు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుల్లో కూడా విభజన ఖాయం కనుక, అదేదో తొందరగా జరిగితే బాగుండుననే భావన కనిపిస్తున్నది. అయినప్పటికీ ఆంధ్ర పెత్తందారులు, అక్కడి నాయకులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా సమైక్యాంధ్రే మేలంటూ ఊదరగొడుతున్నారు. అంతే కాకుండా తెలంగాణకు ఓ పరిస్కారం కనుక్కునే బాధ్యత రాష్ట్ర నాయకత్వంపై ఉంది. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అధిష్టానంతో చర్చించి సమస్య పరిస్కారానికి చొరవ తీసుకోవాల్సిన సమయంలో మిన్నకుండి కాలయాపన చేయడం క్షంతవ్యం కాదు. తమ ఆకాంక్షను తెలుపుకునే హక్కును తెలంగాణ ప్రజలకు లేకుండా చేయడం తగని పని. చిదంబరం డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై ఉంది. తెలంగాణపై చంద్రబాబు లేఖ ఇచ్చాక ఇప్పుడు అందులో వెంట్రుకలను ఏరే ప్రయత్నం చేయడం కూడా తగదు. నిజంగానే తెలంగాణపై తేల్చాలనుకుంటే అఖిలపక్షం పెట్టి అందరి అభిప్రాయం తీసుకోవాలి. అప్పుడు చంద్రబాబు కూడా తన అభిప్రాయం ఎలాగూ చెబుతాడు. అంతేగానీ, కొందరు పని గట్టుకుని బాబు లేఖలో ఏమీ లేదని, తెలంగాణపై స్పష్టత లేదని అనడం సరికాదు. ఇవన్నీ పక్కన పెట్టి ముందుగా మార్చ్‌కు అనుమతి తీసుకుని రావాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు మంత్రులుగా కొనసాగడం ఆత్మహత్యా సదృశ్యం తప్ప మరోటి కాదు. మార్చ్‌పై ఉక్కుపాదం మోపితే పుండును గెలకడమే తప్ప మాన్పించే ప్రయత్నంగా భావించలేము. ఇప్పటి వరకు జరిగిన సంప్రదింపులకు, ఉద్యమాలకు ఇప్పటికీ తేడా ఉన్నది. రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో సంప్రదింపులు సాగుతున్నాయన్న వార్తలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఢిల్లీలో లాబీయింగ్ చేద్దామని ప్రయత్నిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నది. జిల్లాల నుంచి రాజధానికి రాకుండా చెక్‌పోస్టులతో అడ్డుకుంటున్నారు. అయితే, జిల్లాల్లో జరుగుతున్న ర్యాలీలు, సభలు, దర్నాలు చూస్తుంటే ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉందో పాలకులు అర్థం చేసుకోవాలి. గత ఏడాదిలో వచ్చిన మార్పును గమనిస్తే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగితే కోస్తా, రాయలసీమల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వేగంగా పుంజుకుంటాయని స్పష్టమవుతున్నది. కోస్తా, రాయలసీమ ప్రజల నోట కూడా ఆత్మగౌరవం కోసం పోరాడాలనే మాట వినబడుతున్నది. ఇప్పటికైనా పాలకులు ముఖ్యంగా తెలంగాణ ప్రాంత నాయకులు ప్రభుత్వం వద్ద తమ వాదనను బలంగా వినిపించాలి. మార్చ్‌కు ఆటంకం లేకుండా, శాంతియుతంగా జరిగేలా చూడాలి.