వేములవాడలో రోడ్లన్నీ తవ్వేస్తున్నారు…
వేములవాడ టౌన్, ఆగస్టు 3 (జనంసాక్షి) : వేలాది మంది తిరుగాడే పబ్లిక్ రోడ్లన్నీ ఎక్కడి కక్కడ తవ్వుతున్నా పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేములవాడ పట్టణంలోని వీధులన్నీ గుంతలుగా మారి కనీసం నడవడానికి వీలులేకుండా తయారవుతున్నాయి.అభివృద్ధికి సూచకాలుగా భావించే పబ్లిక్ రోడ్లు గుంతలుగా మారుతూ, వర్షాకాలంలో ఈ గుంతల్లో నీరు చేరుతూ నిల్వ ఉండడంతో ఈగలు, దోమలు చేరి వ్యాధులు ప్రబలుతున్నాయి. లక్షలా ది రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లను కనీస బాధ్యత లేకుండా డామేజీ చేస్తున్నా కనీసం ప్రశ్నించే నాథుడే కరవయ్యాడు. బాధ్యతగా వ్యవహరిం చాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఒక్కో ఇంటి ముందు ఇష్టం వచ్చినట్లుగా తవ్వుతుండడంతో రోడ్లన్నీ ఎత్తుపల్లా లుగా మారుతూ, వాహనాలపై ప్రయాణించేవారికి చుక్కలు కనబడుతున్నా యి. పుణ్యక్ష్తేతమైన వేములవాడ పట్టణంలో నివసించే సుమారు 40 వేల మందితో పాటు రాజన్న సన్నిధికి తరలివచ్చే వేలాది భక్తులు సంచరించే మెయిన్ రోడ్డు, జాత్రాగ్రౌండ్, పోచమ్మ వీధి, భీమేశ్వరాలయం వీధి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ గుంతలుగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పబ్లిక్ రోడ్లను డామేజీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలనే కనీస ఆలోచన లేకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోడ్లను తమ ఇష్టారాజ్యంగా తవ్వుతున్నా పట్టించుకోకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పాదాచారులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.