వైకాపా విష ప్రచారాలను తిప్పి కొట్టాలి

లోటు బడ్జెట్‌ ఉన్నా అభివృద్దిలో ముందుకు : టిడిపి

అమరావతి,జూన్‌29(జనం సాక్షి ): ఒక వైపు కూలీలకు ఉపాధి కల్పిస్తూ మరోవైపు రైతులకు, రాష్ట్ర ప్రజలకు అవసరమైన పనులు ఉపాధిహావిూ పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తోందని, అయితే విపక్ష వైకాపా కేంద్రానికి లేఖలు రాస్తూ ఉపాధి నిధులకు అడ్డం పడుతోందని టిడిపి ఆరోపిస్తోంది. ఇంతటి దౌర్భాగ్య విపక్షం గతంలో ఎక్కడా లేదని టిడిపి నేతలు అంటున్నారు. ఈ పథకం అమలులో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉన్నది. ఈ వాస్తవాన్ని భరించలేక వైసీపీ నాయకులు కేంద్రానికి తప్పుడు లేఖలు రాయడమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నవ్యాంధప్రదేశ్‌ అభివృద్ధిని ఆపలేరని మంత్రిలోకేశ్‌ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఒక వైపు కూలీలకు ఉపాధి కల్పిస్తూ మరోవైపు రైతులకు, రాష్ట్ర ప్రజలకు అవసరమైన పనులు ఉపాధిహావిూ పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తోందని దీనిని అడ్డుకోవడంలో కుట్ర తప్ప మరోటి లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఈ పథకం అమలులో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉన్నది. ఈ వాస్తవాన్ని భరించలేక వైసీపీ నాయకులు కేంద్రానికి తప్పుడు లేఖలు రాయడమే కాకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగేళ్లుగా లోటు బడ్జెట్‌తో ఉన్న ఎపి విభజన తరవాత అనేక సమస్యలు ఎదుర్కొంటోందని అన్నారు. అయినా అభివృద్దిలో వెనకడుగు వేయకుండా సిఎం చంద్రబాబు చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక విపక్షం అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడుతుందన్నారు. రాజకీయ దురుద్దేశంతో అడుగడుగునా అడ్డుకునేందుకుప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. నిధులు మళ్లిస్తున్నారు, కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగ మయ్యాయంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా ఉపాధిహావిూ కూలీల ప్రయోజనాలకు గండికొట్టారని అన్నారు. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఉపాధిహావిూ నిధుల్లో ఒక్కరూపాయి కూడా దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఖర్చుచేస్తున్న ప్రతి పైసాకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి పారదర్శకతకు పెద్దపీట వేసింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ లక్షలాది మంది కూలీలకు అండగా ఉండే పథకాన్ని అడ్డుకోవడం ప్రతిపక్షాల దుర్బుద్ధి చర్యలకు నిదర్శనం. పూట గడవక అర్ధాకలితో ఉండే కార్మికుల కుటుంబాలకు అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలన్నారు. గతంలో ఉపాధి హావిూ పథకాన్ని కాంగ్రెస్‌ నాయకుల ఉపాధి హావిూ పథకంగా మార్చి 80 శాతం పనులను యంత్రాలతో చేయించి 20శాతం కూలీలకు ఇచ్చారు. ఆ పనుల్లో కూడా మూడోవంతు మాత్రమే కూలీలకు దక్కింది. పథకం ప్రారంభించిన అనంతపురం జిల్లాలోనే జరిగిన సోషల్‌ ఆడిట్‌లో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఉపాధి హావిూ కోసం పేర్లు నమోదు చేసుకున్న కుటుంబాల్లో 6శాతం కుటుంబాలకే వంద రోజుల పని దొరికింది. నేడు అటువంటి వాటికి అవకాశం లేకుండా ఉపాధి హావిూ పథకంలో జరిగే ప్రతి లావాదేవీ ఆన్‌లైన్‌లో నమోదవుతుందని అన్నారు. వైకాపా నాయకుల ఫిర్యాదుతో కేంద్రం నుంచి నిధుల విడుదలలో జరిగిన జాప్యం వల్ల బిల్లులు సకాలంలో మంజూరుకాక కూలీలు ఇబ్బంది పడుతున్న తీరు వారి దుష్టబుద్దిని తెలయిచేస్తోందని అన్నారు. ఉపాధి హావిూలో పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్‌ జరుగుతోందని వైకాపా ఎంపీలు అలేఖలు రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. నీరు-చెట్టు పేరుతో ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విష ప్రచారంగా అభివర్ణించారు.