వైరస్‌ బారినపడి చనిపోయిన కేరళ నర్సు లినీ పుతుస్సెరి

కన్నీటి గాధకు కరిగిన ప్రభుత్వం
ఆర్థికంగా ఆదుకుంటామని ప్రకటన
తిరువనంతపురం,మే23( జ‌నం సాక్షి):  ప్రాణాంతక నిపా వైరస్‌ సోకిన రోగికి వైద్య సేవలు అందించి, అదే వైరస్‌ బారినపడి చనిపోయిన కేరళ నర్సు లినీ పుతుస్సెరి(28) కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, ఇద్దరు పిల్లలకు 10లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. లినీ పుతుస్సెరీ అంతిమ ఘడియల్లో రాసిన లేఖ నెటిజన్లను కంటతడి పెట్టించింది. లినీకి ఐదు, రెండేళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త సజీష్‌.. బహ్రెయిన్‌లో ఉంటుండడంతో పిల్లలను తానే చూసుకుంటోంది. కోజికోడ్‌లోని పరంబ్ర తాలూక్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న లినీ ఇటీవల నిపా వైరస్‌తో బాధపడుతున్న రోగికి చికిత్స చేసిన బృందంలో ఉంది. ప్రాణాంతక జాడ్యం ఆమెకూ సోకడంతో సోమవారం మృతి చెందింది. తాను బతికే అవకాశాల్లేవని తెలుసుకొని, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న పిల్లల కోసం పరితపించింది. దీనిపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఆ కుటంబానికి అండగా ఉంటామని ప్రకటించింది.