వ్యవసాయంలో సేంద్రియ బాట పట్టండి
రైతులకు శాస్త్రవేత్తల సూచన
నిజామాబాద్,ఫిబ్రవరి19(జనంసాక్షి): రైతులు అప్పుల నుంచి బయటపడేందుకు లాభసాటి, నాణ్యమైన పంటలు పండించాలని వ్యవసాయవేత్తలు సూచించారు. డిమాండ్ ఉన్న పంటలను కేవలం సేంద్రియ
పద్దతుల్లో పండించడం అలవాటు చేసుకోవాలని అన్నారు. దుకాణాదారుల మోసపూరిత మాటలు నమ్మకూడదని, సారవంతమైన భూములను కాపాడుకోవాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.అప్పుడు అంతర్ఆజతీయంగా కూడా డిమాండ్ ఉంటుందన్నారు. మార్కెట్లో డిమాండ్, అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని చెప్పారు. రసాయన ఎరువులు వాడడంతో రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఒకే సమయంలో ఒకే రకమైన పంటలు పండించడంతో నష్టపోతున్నారని అన్నారు. జొన్న, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలను పండించాలని సూచించారు. రైతులు పత్తిని సీసీఐ వారికి అమ్మకుండా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మడంతో నష్టపోతున్నారని తెలిపారు.జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని, అంతరిస్తున్న అటవీ సంపదను కాపాడుకోవాలని అన్నారు. 267 రకాల పురుగులు పంటలను నాశనం చేస్తున్నాయని, జిల్లాలో వంద ఏండ్లకు పైగా పత్తి పంట సాగు చేస్తున్నారని, నిపుణులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనల ప్రకారం వ్యవసాయం చేయాలని సూచించారు. దిగుబడి పెరుగుతున్న కొద్దీ ధరలు కూడా పెరుగుతున్నాయని, వ్యవసాయరంగంలో పురాతన పద్ధతులను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వివిధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు వారి అనుభవాలను, సూచనలను అందించారు. పంట కాపాడుకొనే సమయంలో ఫెన్సింగ్‌కు విద్యుత్ అమర్చడంతో రైతులు మరణించడం, ఆ రైతు కుటుంబాలు అనాథలు అవుతున్నారని తెలిపారు. పంట చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.