వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు పెద్దపీట

రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం

ఖమ్మం,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా వ్యవసాయ మార్కెట్లకు రాబోయే నాలుగు సంవత్సరాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ మార్కెట్‌లు ఉండగా ఖమ్మం జిల్లాలో ఏడు మార్కెట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్లు రైతులకు సేవలు అందిస్తున్నాయి. అయితే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, కల్లూరు, మధిర వ్యవసాయ మార్కెట్లకు మినహా మిగిలిన అన్ని మార్కెట్లకు రిజర్వేషన్లను ప్రకటించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మార్కెట్లకు పీసా చట్టం అమలవుతున్నందున తిరిగి సదరు మార్కెట్లకు ఎస్టీలకే కేటాయించడం జరిగింది. మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు పెద్దపీట వేశారు. అయితే కొన్ని మార్కెట్లకు ఎస్టీ మహిళలకు అవకాశం కల్పించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ప్రస్తుతం బీసీలకు కేటాయించగా రెండోసారి ఓసీకి, మూడో దఫా ఎస్సీ మహిళకు, నాలుగోసారి ఓసీ మహిళకు, ఐదోసారి బీసీ జనరల్‌కు కేటాయించడం జరిగింది. వైరా మార్కెట్‌కు ప్రస్తుతం ఎస్టీకి కేటాయించగా రెండో దఫాలో ఓసీకి, మూడో దఫాలో ఎస్సీ, నాలుగో దఫాలో ఓసీకి, ఐదో దఫాలో బీసీకి కేటాయించారు. నేలకొండపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ప్రస్తుతం ఓసీలకు కేటాయించగా రెండో దఫాలో ఎస్టీకి, మూడో దఫాలో ఓసీ మహిళకు, నాలుగో దఫాలో బీసీకి, ఐదో దఫాలో ఓసీకి కేటాయించడం

జరిగింది. ఏన్కూరు మార్కెట్‌ సైతం పీసా చట్టం పరిధిలో ఉండటంతో రానున్న నాలుగు సంవత్సరాలు సైతం ఎస్టీ అభ్యర్థులకే కేటాయించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం, ఇల్లెందు, చర్ల మార్కెట్లకు ప్రస్తుతం ఎస్టీ జనరల్‌ అమలవుతుండగా రానున్న నాలుగు సంవత్సరాలుకు ఎస్టీ జనరల్‌కే కేటాయించడం జరిగింది. అదేవిధంగా బూర్గంపాడు, దమ్మపేట, భద్రాచలం వ్యవసాయ

మార్కెట్లు ప్రస్తుతం ఎస్టీ మహిళ కొనసాగుతుండగా రానున్న నాలుగు సంవత్సరాలు సైతం ఎస్టీ మహిళలకే కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.వ్యవసాయ మార్కెట్లకు రిజర్వేషన్‌ విధానాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం అదే ఒరవడిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రానున్న నాలుగు సంవత్సరాలుకు గాను ముందస్తుగానే రిజర్వేషన్లను ప్రకటించింది. ఇప్పటికే రిజర్వేషన్లకు అనుగుణంగా కమిటీలను ప్రకటించింది. కమిటీ పదవీ కాలం ఒక్క సంవత్సరానికి కుదించడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల రెండు దఫాలుగా ఆరు నెలలకు ఒకసారి చొప్పున పొడిగించే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది.