వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే విద్యుత్ సంస్కరణలు
మోత్కూరు డిసెంబర్ 12 జనంసాక్షి : వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, విద్ద్యుత్తు సంస్కరణలు అమలు చెయ్యాలని చూస్తుందని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు అన్నారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో సీపీఎం పార్టీ గ్రామ శాఖ సమావేశం చింతకింది సోమరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న, విద్ద్యుత్తు సంస్కరణలు రాష్ట్రంలో అమలైతే, ఒక్కో వ్యవసాయ మోటర్ పై బిల్లులు చెల్లించవలసి వస్తుందని, ఇప్పటికీ వరకు రాష్ట్రంలో అమలు చేయనప్పటికి, ఖచ్చితంగా అమలు చెయ్యాలని, రాష్ట్ర ప్రభుత్వం పై, కేంద్ర ప్రభుత్వం వత్తిడి తెస్తుందని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టీ విద్ద్యుత్తు బిల్లులు లాక్కోవాలని చూస్తుందని, అన్నారు. అదే జరిగితే, ఆరుకాలం కష్టపడే రైతుకు మిగిలేది ఏమిఉండదని, ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతూ, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ కూలీలు, యంత్రాలకిరాయి, పెరిగిన డీజిల్ ధరలతో, సాగు ఖర్చు పెరిగి, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, అల్లాడుతున్న రైతాంగం పై, విద్ద్యుత్తు బిల్లులు రైతుల నెత్తిమీద వేస్తే, వ్యవసాయం సంక్షోభం లోకి వెళుతుందని, దీని ప్రభావంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి, ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడే అవకాశం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ పాలడుగు గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, కొంపల్లి ముత్తమ్మ, వెండి యాదగిరి, వడ్డేపల్లి లక్ష్మణ్, కొంపల్లి గంగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.