వ్యూహం మార్చిన బీజేపీ!

– ఉప ఎన్నికల దెబ్బతో పాత మిత్రులవైపు చూపు
– శివసేన పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రేను కలవనున్న అమిత్‌షా!
– నేడు ముంబైలో ఇరువురి భేటీ
ముంబయి, జూన్‌5(జనం సాక్షి) : ఇన్నాళ్లూ ఎన్డీయేలోని మిత్రులు పోతే పోనీ అన్నట్లుగా వ్యవహరించిన ఆ పార్టీ మళ్లీ పాత మిత్రులను కలుపుకొనే పనిలో పడింది..  ఉపఎన్నికల్లో వరుస ఓటములతో కుంగిపోయిన బీజేపీ వ్యూహం మార్చి 2019 ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. పథాన్ని పక్కనపెట్టిన అమిత్‌షా మెల్లగా కాస్త వెనక్కి తగ్గున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమకు బీజేపీయే అతిపెద్ద శత్రువు అని చెప్పిన శివసేన పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రేను అమిత్‌ షా కలవనున్నారు. ఈ మేరకు బుధవారం ముంబైలో వీళ్ల భేటీ జరగనుంది. బీజేపీతో తెగదెంపుల తర్వాత ఆ పార్టీని శివసేన తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన పాల్‌ఘర్‌ ఎన్నికల్లో ఈరెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కూడా శివసేన ఆరోపించింది. తమకు రాజకీయాల్లో అతిపెద్ద శత్రువు బీజేపీనే అని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ ఈ మధ్యే అన్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా.. ఉద్ధవ్‌ థాక్రేను కలవడనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. అమిత్‌ షానే ఉద్ధవ్‌ జీ సమయం కోరారు. బుధవారం సాయంత్రం వీళ్ల సమావేశం ఏర్పాటు చేశాం అని శివసేన పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత తమ నేతను అమిత్‌ షా కలవడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికలతో దీనికి సంబంధం లేదని, దేశవ్యాప్తంగా పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగానే ఉద్ధవ్‌ను అమిత్‌ షా కలుస్తున్నారని బీజేపీ సీనియర్‌ నేత సుధీర్‌ ముంగంతివార్‌ వెల్లడించారు. పాల్‌ఘర్‌ ఉప ఎన్నికల్లో శివసేనపై బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్డీయే నుంచి తెదేపా పార్టీ తప్పుకుంది. శివసేన, నితీష్‌ వర్గంసైతం ఆమేరకు అడుగులు వేస్తున్న సమయంలో అమిత్‌షా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో పాత మిత్రులను కలుపుకొని పోయే పనిలో అమిత్‌షాఅడుగులే వేస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ నెల7న ముంబాయిలో ఎన్డీయే మిత్రపక్షాలతో బీజేపీ చీఫ్‌ అమిత్‌ సమావేశం కానున్నారు. జేడీయూ, బీజేపీ మధ్య సమన్వయం పెంచేలా కూడా అమిత్‌షా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా ఇప్పటికే ఎన్టీయేలో భాగస్వామ్యమైన టీడీపీ బయటకు రావటంతో.. ఏపీలో మాత్రం టీడీపీని ఓడించటమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుండటం మరో విశేషం.