వ్యోమగాముల రక్షణపై..
ఇస్రో ప్రయోగం విజయవంతం
నెల్లూరు, జులై5(జనం సాక్షి) : మానవ సహిత రాకెట్ ప్రయోగంపై ఇస్రో దృష్టి సారించింది. ఇందుకోసం శ్రీహారికోటలో గురువారం చేపట్టిన క్రూ ఎస్కేప్ సిస్టం పరిశోధన విజయవంతమైంది. ప్రయోగం అనంతరం షార్‌కు 3 కిలోవిూటర్ల దూరంలోని బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో పారాచుట్ సాయంతో వ్యోమగాములు దిగారు. ఇస్రో చైర్మన్ శివన్ 300కు పైగా సెన్సార్ల ద్వారా ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. రాకెట్ ప్రమాద సమయాల్లో వ్యోమగాములు సురక్షితంగా బయటపడేలా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడమే ప్రయోగం ఉద్దేశంగా ఇస్రో తెలిపింది. అంతరిక్ష యాత్రలు క్రమేపీ వాణిజ్య స్థాయిని అందుకుంటున్న ప్రస్తుత తరుణంలో వ్యోమగాముల రక్షణపై ప్రయోగం చేసిన ఇస్రో అందులో విజయం సాధించింది. శ్రీహరికోట సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదిక నుంచి ప్రత్యేక ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఓ చిన్న రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. అనంతరం పారాచుట్ సాయంతో వ్యోమగాములు బంగాళాఖాతంలోకి దిగారు. ఈ ప్రయోగం కోసం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభంకాగా గురువారం ఉదయం రాకెట్‌ను రోదసిలోకి ప్రయోగించి విజయం సాధించారు.