శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో పనిచేస్తుంది
ఎస్పి రంజన్ రతన్ కుమార్.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి);
శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఎస్.పి. ఆదేశించారు. మహిళలు ఇతరుల చేత ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు. అలాగే సివిల్ వివాదాలను పిర్యాదు దారులు కోర్టు లలో పరిష్కరించుకోవాలని, సివిల్ వివాదాలు స్వీకరించబడువు అనే విషయాలను పిర్యాదు దారులు గ్రహించాలని అన్నారు.
దరూర్ మండలం లో ఒక గ్రామానికి చెందిన మహిళ గర్భవతి అయిన తనను అత్త మామలు వేధిస్తున్నారని, సంగాల చెరువులో శ్రీ చెన్న కేశవ మత్స పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు పెంచుకున్న చేపలు దొంగతనం చేశారని, మల్డకల్ మండలం సద్దనోని పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తను భూమిని కొనుగోలు చేసేందుకు మాట్లాడి 20 లక్షలు డబ్బులు పూర్తిగా చెల్లించిన తన అన్న దమ్ములు రిజిస్ట్రేషన్ చేయడం లేదని, గట్టు మండలం నల్లగట్టు తండాకు చెందిన వెంకటేష్ రాథోడ్ తన తండ్రి పేరున ఉన్న 4 ఎకరాల భూమిని తన తండ్రి కి తెలియకుండా ఇతరులు వారి పేరు మీద ఖాతా మార్పిడి చేసుకున్నారని, గద్వాల పట్టణానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి 2017 సంవత్సరం లో తను శ్రీరాం చిట్ ఫౌండ్ నుండి 3లక్షలను ప్రభుత్వ ఉద్యోగి అయిన తన తమ్ముడిని ష్యురిటీ గా పెట్టి అప్పు తీసుకోగా పలు కారణాల చేత కొంత డబ్బును మాత్రమే తిరిగి కట్టనందుకు 7 లక్షలు చెల్లించాలని తన తమ్ముడికి నోటీస్ లు పంపించి వేధిస్తున్నారని, అదేవిధంగా కుటుంబ కలహాలు,భూమి తగాదాల సమస్యలకు సంబంధించిన 12 ఫిర్యాదులతో వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పలువురు బాధితులు జిల్లా ఎస్పీ ని కలిసి న్యాయం జరిపించాలని కోరారు.ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ బాధితులకు న్యాయం చేసేందుకు చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.