శాఖల కేటాయింపులో మల్లగుల్లాలు

– ఆర్థికశాఖ కుమారస్వామి వద్దే!
– ఇంధనం శాఖ కోసం డీకే, రేవణ్ణ ఫైట్‌..?
– కొలిక్కిరాని కర్ణాటక మంత్రిత్వ శాఖల కేటాయింపు
బెంగళూరు, మే30( జ‌నం సాక్షి): కర్ణాటకలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వారం దాటినా కీలక మంత్రిత్వ శాఖల విషయంలో ఇంకా కాంగ్రెస్‌, జేడీఎస్‌ మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. ఆర్థిక శాఖ విషయంలో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య స్పష్టత వచ్చిందని, ముఖ్యమంత్రి కుమారస్వామి ఆర్థిక శాఖ తన వద్దే ఉంచుకునేందుకు కాంగ్రెస్‌ ఎట్టకేలకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే పీడబ్ల్యూడీ, ఇంధనం శాఖలపై కుమారస్వామి సోదరుడు, ¬లెనర్సిపూర్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ ఆసక్తి చూపుతున్నారని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ సైతం ఇంధనం పోర్ట్‌పోలియో కోసం పట్టుబడుతున్నారని తెలుస్తుంది. సిద్ధరామయ్య గత ప్రభుత్వంలో శివకుమార్‌ ఇంధనం శాఖ మంత్రిగా ఉన్నారు. శివకుమార్‌కు కెపీసీసీ చీఫ్‌ ఇస్తారని అనుకుంటుండగా, ఆ పదవితో పాటు మంత్రివర్గంలోనూ కొనసాగేందుకు ఆయన పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంసైతం ఇందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పశుసంవర్ధక శాఖ, కార్మిక, మత్స్య, యువజన సేవలు, మహిళా, శిశ సంక్షేమం శాఖలను తమ జూనియర్‌ పార్టనర్‌కు వదలాలని కాంగ్రెస్‌ అనుకోవడం కూడా జేడీఎస్‌ నేతలకు మింగుడు పడటం లేదని అంటున్నారు. ఈ
నేపథ్యంలో జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటానని కుమారస్వామి చెప్పారని, ఇందుకు సమయం కావాలని కోరినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌ నేతలు సైతం సోనియాగాంధీ మెడికల్‌ చెకప్‌ కోసం ఆమె వెంటే వెళ్లిన రాహుల్‌ గాంధీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. రాహుల్‌ గాంధీ స్వదేశానికి వచ్చిన తరువాత కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమిల మధ్య శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వస్తుందని తెలుస్తోంది.