శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి భారత్ జర్మనీ పరస్పర అంగీకారం
బెర్లిన్, (జనంసాక్షి) :
శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని భారత్, జర్మనీ నిర్ణయించాయి. బెర్లిన్‌లో జరుగుతున్న ఇండియా, యురోపియన్ యూనియన్ సంయుక్త సదస్సులో ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి. పెట్టుబడులు, విద్యుత్, చమురు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, రక్షణ రంగంలో మరింత పరస్పర సహకారం అవసరమని నిర్ణయానికి వచ్చాయి. పరస్పర అంగీకారంతో ఈ రంగాల్లో మరింత పురోగామించాలని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్, జర్మన్ చాన్స్‌లర్ అంగేలా మేర్కెల్ అభిప్రాయపడ్డారు. సదస్సు అనంతరం ఈమేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉన్నత విద్య, పరిశోధన, సాంకేతికరంగాల్లో క్రియాశీలక సహకారం అందించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య చేసుకున్న ఒప్పందం ఇరువురికి ఆర్థికంగా చేకూర్పునిస్తాయని పేర్కొన్నారు. భారత్, యురోపియన్ యూనియన్ భవిష్యత్ అగ్రశేణి రాజ్యాలుగా ఎదగడంలో ఈ ఒప్పందం ఎంతగానో సహరిస్తుందని ఇరు దేశాల ప్రతినిధులు వెల్లడించారు. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే మార్గాలు అన్వేషించాలని, మేధో వికాసం ద్వారానే సాధ్యమన్నారు. శాంతి, సామరస్యం ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ఇప్పుడు ప్రపంచశాంతి కోసం పాటు పడాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలని, వాటి నుంచి విముక్తి కోసం ఐక్య రాజ్యసమితితో పాటు ప్రతి ఐక్య కూటమి దోహదపడాల్సి ఉందన్నారు. ప్రపంచశాంతికి విఘాతం కలిగించే శక్తుల పట్ల ప్రతి దేశం అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. యురోపియన్ యూనియన్, భారత్ భవిష్యత్‌లో అభివృద్ధికి చిరునామా కావాలని ఆకాంక్షించారు.