శిథిలావస్థలో పాఠశాల భవనాలు… పట్టించుకోని ప్రభుత్వం…

విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేకపోవడం సిగ్గుచేటు..
బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్…
అనంతగిరి,జనంసాక్షి:
అనంతగిరి నూతన మండలంగా ఏర్పడి ఏండ్లు గడుస్తున్న అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించడం లేదని, కనీసం విద్యార్థులకు పాఠశాల భవనాలు నిర్మించకపోవడం దారుణమని తెలంగాణ బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు. అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం పాఠశాల విద్యార్థులకు.  6000 రూపాయల వ్యయంతో అవసరమైన ఆరు గ్రీన్ బోర్డులను  ఉపాధ్యాయులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవ రూపేనా ఎక్కడా కూడా అటువంటి దాఖలు కనిపించడం లేదన్నారు. అందుకు ఉదాహరణ అనంతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,ప్రాథమిక పాఠశాలగా చెప్పవచ్చు అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెచ్చులు ఊడి పడుతు ఉండడంతో, విద్యార్థులు భయం భయంగా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం వర్షాకాలం పరిస్థితి దృష్ట్యా శిథిలావస్థలో ఉన్న భవనాల వల్ల ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమోనని, పిల్లలను పాఠశాలకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఇష్టపడడం లేదని… ఇదే అదనగా చదువుకుంటున్న పిల్లలను పనులకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పరిస్థితి అంతే ఉందని, కనీస సౌకర్యాలు లేకపోవడం విద్యార్థులు కిందనే కూర్చుని పాఠాలు వింటున్నారని అన్నారు. అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకునే నాయకులకి ఇవి కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. నిరుపేద కుటుంబానికి చెందిన  ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అధిక శాతం ప్రభుత్వ పాఠశాల విద్యను అభ్యసిస్తారని, అటువంటి విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను, అందించలేకపోవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు నూతన భవనాల నిర్మానించాలని బీసీ సంఘం తరఫున ఆయన డిమాండ్ చేశారు.