శుభకార్యాలకు శ్రావణం అమోఘం

ఈనెలలోనే దండిగా పెళ్లి ముహూర్తాలు
విజయవాడ,ఆగస్ట్‌11( జనం సాక్షి): కరోనాతో అడపాదడపా వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తున్న వారికి శ్రావణం కొంత ఆశ నింపుతోంది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంతో పాటు థర్డ్‌ వేవ్‌ ఆగస్టులో వస్తుందన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లకు వేల జంటలు సిద్ధమవుతున్నాయి. ఈ నెలలో వివాహాది శుభ ముహుర్తాలు ప్రారంభంఅయ్యాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాల ఘడియలు మొదలయ్యాయి. ఆషాడ మాసం ఆదివారం ముగిసింది. సోమవారం నుంచి శ్రావణ శోభ సంతరించుకుంది. ఇదే సమయంలో మంగళవారం మంగళగౌరీ వ్రతాలు జరిగాయి. మరోవైపు పెళ్లి బాజాలు మోగనున్నాయి. శ్రావణ శుక్రవారాలు, రాఖీ పౌర్ణమి వంటి పండుగలతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యక్రమాలకు ముహూర్తాలు అధికంగా ఉండడంతో మార్కెట్లు సైతం కళకళలాడనున్నాయి. శ్రావణమాసం నెల పాటు మంచి ముహూర్తాలు ఉండడం ఆ తర్వాత వచ్చే భాద్రపద మాసంలో శుభ ముహూర్తాలకు ఆస్కారం లేదని వాస్తు, జ్యోతిష పండితులు చెబుతున్నారు. భాద్రపద మాసాన్ని శూన్య మాసంగా పేర్కొనడంతో ఆశ్వయుజ మాసంలో మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు భారీగా జరగనుండడంతో వస్త్ర వ్యాపారాలు, బంగారు ఆభరణాల వ్యాపారంతో పాటు కల్యాణ మండపాలు, టెంట్‌ హౌస్‌లు, కిరాణా, డెకరేషన్స వంటి అనేక రకాల వ్యాపారులకు గిరాకీ ఏర్పడనుంది. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లి బాజాలు మోగాయి. ఈ నెల 9 నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు శ్రావణ మాసం కావడంతో వివాహాది శుభ ముహూర్తాలు అనుకూలంగా ఉన్నట్లు పండితులు తెలిపారు. దీంతో మళ్లీ సందడి నెలకొంది. ఓ వైపు పండగలు,మరోవైపు శుభముహూర్తాలతో అన్ని వర్గాలకు పనులు దక్కనున్నాయి.