శైవక్షేత్రమంతా శవాల దిబ్బలే

శ్మశానాన్ని తలపిస్తున్న కేదార్‌నాథ్‌
కుప్పలు తెప్పలుగా మృతదేహాలు
వేలల్లోనే మృతులు
న్యూఢల్లీి/డెహ్రాడూన్‌, జూన్‌ 21 (జనంసాక్షి) :
ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌ శవాలదిబ్బగా మారింది. పరమ పవిత్ర శైవ క్షేత్రం శ్మశానంగా మారిపోయింది. గంగమ్మ జల ప్రళయానికి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఎక్కడ చూసిన గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు, మాంసపు ముద్దల్లా మారిన శవాలే! ఈ సాహస్రాబ్దిలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయిన ఉత్తరాఖండ్‌ వరద బీభత్సం వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిలో వేల మంది మృత్యుఒడిలోకి చేరారు. అధికారికంగా 207 మంది మృతి చెందినట్లు ఆ సంఖ్య వేలల్లోనే ఉందని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు చెబుతున్నారు. అంచనాకు కూడా అందని రీతిలో ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని పేర్కొంటున్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు..
వరదలో తీవ్రంగా నష్టతపోయిన ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షం తెరిపి నివ్వడంతో బాధితుల తరలింపు చర్యలు ఊపందుకున్నాయి. రుద్రప్రయాగ్‌, చమోలీ, ఉత్తరకాశీ.. తదితర జిల్లాల్లో పలుచోట్ల రోడ్డు మార్గాలు ధ్వంసం కావడంతో సైన్యం హెలీకాప్టర్లతో సహాయక చర్యలను చేపట్టింది. హరిద్వార్‌లో శుక్రవారం 40 మృతదేహాలను వెలికితీశారు. కేదరినాథ్‌, బద్రినాథ్‌లలో చిక్కుకుపోయిన తొమ్మిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు 40 హెలీకాప్టర్లు నిరంతరం పని చేస్తున్నాయి. మరోవైపు, సైన్యం కూడా సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటుంది. వరద బీభత్సం ఊహకందని రీతిలో నష్టం కలిగించిందని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తెలిపింది. తాజా విపత్తు ఈ సహస్రాబ్దిలోనే అత్యంత విషాదకర ఘటన అని పేర్కొంది. కోలుకోవాలంటే ఐదేళ్లకు పైగా పడుతుందని తెలిపింది. భారీ వరదలకు కేదారినాథ్‌ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హరక్‌సింగ్‌ రావత్‌ తెలిపారు. ఐదుగంటల పాటు ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితిని విలేకరులకు వివరించారు. కేదార్‌నాథ్‌ సర్వం భూస్థాపితం అయిందని వెల్లడిరచారు. ఆ ప్రాంతమంతా మృతదేహాలతో నిండిపోయిందని, శైవక్షేత్రం శ్మశానంగా మారిపోయిందని చెప్పారు. కేవలం ఒక్క గర్భగుడి మినహా మిగతా భవనాలన్నీ కొట్టుకుపోయాయని తెలిపారు. ఊహించని స్థాయిలో ప్రాణనష్టం ఉందని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాకేశ్‌ శర్మ తెలిపారు.
ఉత్తరాఖండ్‌ వరదల్లో ఇప్పటివరకు 207 మంది మృతి చెందారని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని రకాలుగా యత్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 34 వేల మందిని రక్షించామని చెప్పారు. మరో 5 వేల మంది ఇంకా వరదల్లో చిక్కుకొని ఉన్నారన్నారు. శుక్రవారం ఆయన మరో మంత్రి మనీశ్‌ తివారీతో కలిసి ఢల్లీిలో మీడియాతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, అయితే, సమన్వయ లోపం వల్ల కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. ‘సమన్వయ లోపం సమస్యను ఎదుర్కొంటున్నాం. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వీకే దుగ్గల్‌ను నోడల్‌ అధికారిగా నియమించాం. ఆయన శనివారం నుంచి డెహ్రాడూన్‌లో ఉండి సహాయక బృందాలకు, ప్రభుత్వాలకు మధ్య సమన్వయం పెంపొందిస్తారు’ అని చెప్పారు. బాధితులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారత వాయుసేన మరో 13 ఎయిర్‌క్రాఫ్ట్‌లను పంపించిందని చెప్పారు. మొత్తం 43 హెలీకాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని మనీశ్‌ తివారీ తెలిపారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మరో ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిందన్నారు. ఇప్పటివరకు 33,192 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. సహాయక చర్యల్లో సైన్యం, ఎయిర్‌ఫోర్స్‌, ప్రైవేట్‌ హెలీకాప్టర్లు, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ బృందాలు తలమునకలయ్యాయని తెలిపారు. 18 మృతదేహాలను వెలికితీశామన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.145 కోట్ల సహాయం విడుదల చేసినట్లు చెప్పారు.
550 మృత్యువాత
వరద బీభత్సానికి 550 మందిపైగా మృతిచెందారని, 50 వేల మంది ఇంకా పలు ప్రాంతాల్లో చిక్కుకున్నారని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఆదుకోవాలని సోనియా పిలుపు
వరద బాధితులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వచ్చింది. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ నెల వేతనాన్ని ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు విరాళాలుగా ఇవ్వాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ఎంపీలంతా తమ నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని ఆమె సూచించారు. మరోవైపు, పార్టీ ఆధ్వర్యంలో డెహ్రాడూన్‌లో పీసీసీ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఐఏసీసీ సెక్రటరీ సంజయ్‌కపూర్‌, సేవాదళ్‌ విభాగం చీఫ్‌ మహేంద్ర జోషిలు ఇప్పటికే అక్కడికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, అన్ని రాష్టాల్ర పీసీసీ చీఫ్‌లు వరద బాధితుల సహాయార్థం అవసరమైన వస్తువులను సేకరించిన పంపించాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.
500లకు పైగా శవాలను చూశా : కేదార్‌నాథ్‌ ఆలయ పూజారి
ఉత్తరాఖండ్‌లో పోటెత్తిన జల ప్రళయం కేదార్‌నాథ్‌ను తుడిచిపెట్టేసింది. గర్భ గుడి మినహా మిగతా ప్రాంతమంతా శిథిలమైంది. శైవక్షేత్రం శవాల గుట్టగా మారిపోయిందని కేదార్‌నాథ్‌ ఆలయ పూజారి, వరదల్లో ప్రాణాలతో బయటపడిన దినేశ్‌ భగ్వాడి తెలిపారు. వరదల బీభత్సాన్ని, అది మిగిల్చిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆయన శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడిరచారు. ఈ నెల 16వ తేదీ నుంచి కేదార్‌నాథ్‌లో భారీ వర్షం కురిసిందని చెప్పారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆలయం వద్ద భారీ వరద వస్తోందంటూ హాహాకారాలు వినిపించాయని, నిమిషాల వ్యవధిలోనే ఊహించిన స్థాయిలో వరద ముంచెత్తిందని వివరించారు. 40 ఏళ్ల వ్యవధిలో ఇంతటి భారీ స్థాయి వరదలను ఎన్నడు చూడలేదన్నారు. 14 అడుగుల ఎత్తులో ఉన్నందున తాను ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పారు. తనతో పాటు మరో 200 మంది కూడా ప్రాణాలు దక్కించుకున్నారని తెలిపారు. తామంతా చూస్తుండగానే వరదల్లో చాలా మంది కొట్టుకుపోయారన్నారు. నాలుగైదు వేల మంది వరకు మరణించి ఉండవచ్చని ఆయన తెలిపారు. తన కళ్లతో 500కు పైగానే శవాలను చూశానని, మృతుల సంఖ్య వేలల్లో ఉంటుందని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఐదుగురి ఆచూకీ కూడా ఇంకా లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియడం లేదని వాపోయారు.