శ్రావణం, రంజాన్‌లతోనింగిలో పండ్లు, కూరగాయల ధరలు!
హైదరాబాద్, జూలై 29 (జనంసాక్షి): శ్రావణమాసం, రంజాన్‌మాసం ఆరంభం కావడంతో పండ్లు, పూల ధరలు నింగినంటాయి. కూరగాయల ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి శ్రావణమాసం.. 21వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కావడం తెలిసిందే. జంట నగరాల్లో గడచిన వారం రోజుల్లోనే పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. కొత్తపేట ఫ్రూట్‌మార్కెట్, మెహదీపట్నం, జాంబాగ్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఒక మాదిరిగా ధరలు ఉండగా బహిరంగ ప్రదేశాలల్లో మరింత ఎక్కువగా ఉన్నాయి. ఒక మాదిరి బత్తాయి ఒక్కొక్కటి 5 రూపాయలు పలుకు తోంది. డజను బత్తాయిలు 50 నుంచి ఆ పైనే. గత నెలలో అయితే 20 నుంచి 30 రూపాయలే ఉండేది. అదేవిధంగా యాపిల్ 12 రూపాయలుండేది.. ప్రస్తుతం 20 రూపాయలకు చేరుకుంది. పుచ్చకాయ అయితే వేసవిలోనే ఒక మాదిరి కాయ.. అంటే సుమారుగా కిలో బరువు ఉండే కాయ 20 నుంచి 25 రూపాయలు పలుకగా.. ప్రస్తుతం 30 నుంచి 50 రూపాయల వరకు పలుకుతోంది. అదే నల్ల ద్రాక్ష అయితే అర్ధకిలోనే 30 రూపాయలు పలుకుతుండడంతో పావు కిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. ఫైనాపిల్ అయితే ఒక్కొక్కటి 30 రూపాయలు అమ్ముతున్నారు. అవి కూడా పుల్లగా ఉండడంతో వాటి అమ్మకం అంతంత మాత్రంగానే సాగుతోందని కొందరు బండ్ల వ్యాపారులు చెబుతున్నారు. అదీగాక వర్షాకాలం కావడం.. వర్షాలు పడుతుండడం.. తేమ ఎక్కువగా ఉండడంతో వాటిని తినేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. వాటి కొనుగోళ్లు కొంత మందకొడిగానే సాగుతున్నాయన్నారు. అలాగే డజను అరటి పండ్లు 20 నుంచి 25 రూపాయలు పలికేవి. శ్రావణం, రంజాన్ పుణ్యమా అని ఒక మాదిరి కాయలు డజను 35 నుంచి 50 రూపాయల వరకు వాటి ధర పలుకుతోంది. డజను కొనేవారు కాస్తా అరడజనుతో సరిపెట్టుకుంటున్నారు. అదీగాక ఇవి సంవత్సరం పొడుగునా లభిస్తుండడంతో వాటి కొనుగోళ్లు సాధారణంగా ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే ఖర్జూర పండు ఈ నెల 20వ తేదీ వరకు కిలో 30 నుంచి 40 రూపాయల వరకు మాత్రమే ఉండేది. ఈ నెల 21వ తేదీ నుంచి అది కాస్తా 60 నుంచి 80 రూపాయలకు చేరుకుందని బండ్ల వ్యాపారులు అంటున్నారు. అయినప్పటికీ కొనుగోళ్లు బాగా కొనసాగుతున్నాయని, పండు ధర, ఖర్చులు పోను కొద్దిగా లాభసాటిగానే ఉందని ఖర్జూర బండ్ల విక్రయదారులు కొందరు చెబుతున్నారు. అయితే ఖర్జూరపండులో చాలా రకాలు ఉన్నాయి. ర జామపండు మాత్రం ఒక మాదిరి కాయ రెండు రూపాయలే. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఇక కూరగాయల ధరలు వర్షాలు కురుస్తున్నా.. ఏ మాత్రం తగ్గకపోవడం పట్ల కొందరు మహిళలు నిరసన తెలుపుతున్నారు. కిలో కొనేవాళ్లం.. అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నామని అంటున్నారు. కిలో క్యారెట్ 40 నుంచి 50 రూపాయల మధ్యే కొనసాగుతోందని, ఇది రెండు నెలలుగా అదే ధర ఉంటోందని వారంటున్నారు. బీట్‌రూట్ కిలో 20 రూపాయలు, టమాటాలు కిలో 20, వంకాయలు కిలో 20, దోసకాయ కిలో 15 రూపాయలు.. ఇలా ఏ కూరగాయ పట్టుకున్నా కిలో 15-20 రూపాయల మధ్యే ధర పలుకుతోందన్నారు. ఇక ఆకుకూరల్లో గోంగుర, తోటకూర, పాలకూర తదితర ఆకుకూరల ఒక మాదిరి కట్టలు పది రూపాయలకు 3 నుంచి 5 మాత్రమే ఇస్తున్నారు. వేసవిలో అదే తీరు.. ప్రస్తుతం అదే తీరులో ధరలు ఉండడం పట్ల వినియోగదారులు వాపోతున్నారు. పుదీనా, కొత్తిమీర కట్టలు కూడా అదే రేటు పలుకుతోందని అంటున్నారు. ఏది ఏమైనా ధరలు తగ్గాలంటే మరో 22 రోజుల పాటు వేచి ఉండాల్సిందేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.