శ్రీవారిని దర్శించుకున్న కెన్యా మాజీ ప్రధాని
– పట్టు వస్త్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు
– ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించడం ఆనందం ఉందన్న రైలా ఒడింగా
తిరుమల, జులై2(జనం సాక్షి) : తిరుమల శ్రీవారిని కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామసమయంలో రైలా ఒడింగా కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో రైలా ఒడింగా దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా తెలిపారు. ఇలాంటి అధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.. తిరుమలకు రావడంతో హిందూ ధర్మం పై పూర్తి అవగాహన వచ్చిందని ఒడింగా పేర్కొన్నారు. సుందరమైన ప్రాంతంగా తిరుమలను వర్ణించారు.
శ్రీవారిని దర్శించుకున్న పరిపూర్ణానంద సరస్వతి స్వామి..
తిరుమల శ్రీవారిని సోమవారం వీఐపీ విరామసమయంలో స్వామి పరిపూర్ణానంద సరస్వతి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామిజీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామిజీకి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ…. వారి కష్టాలు స్వామి వారికి చెప్పుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తులకు కొత్త సమస్య సృష్టించడం ఖండించదగ్గ చర్య అని పరిపూర్ణానంద స్వామిజీ తెలిపారు. ఆలయంపై తరచు వస్తున్న ఆరోపణలు చూస్తుంటే సమన్వయ లోపం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అర్చకులు, సిబ్బంది మధ్య వివాదాలు తొలగించుటకు ఒక సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. శ్రీవారి ఆలయం పై వస్తున్న ఆరోపణలకు తెరపడే విధంగా టీటీడీలో ఉన్న వివిధ విభాగల నుంచి ఈ కమిటీని ఏర్పాటు చేసి ఆరోపణలకు తెరపడే విధంగా చర్యలు తీసుకోవాలని స్వావిూజి సూచించారు. ఇదిలావుంటే ‘సీతమ్మ వాకిట్లో సిరిమ్లలె చెట్టు’ చిత్రంలో తెలుగు సినీ అభిమానులకు గుర్తుండిపోయే సీతగా నటించిన అంజలి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొన్నటివరకూ బొద్దుగా ఉన్న అంజలి ఒక్కసారిగా సైజ్ జీరోగా కనిపించడంతో ఆమెను చూసిన వారు ఆశ్చర్యపోయారు. కాగా, ఆలయం వెలుపల అంజలితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.