శ్రీవారిని దర్శించుకున్న తెరాస ఎంపీలు

తిరుమల, జులై6(జ‌నం సాక్షి) : తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, రాష్ట్ర టెక్నికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ చిరుమళ్ల రాకేశ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహకార కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు శుక్రవారం దర్శించుకున్నారు. వీరంతా శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడక ద్వారా గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ రిసెప్షన్‌ అధికారులు స్వాగతం పలికి, బస ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో సంతోష్‌ కుమార్‌, సుమన్‌కు ఆలయ అర్చకులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీలు సంతోష్‌కుమార్‌, బాల్కన్‌ సుమన్‌లు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభ్యున్నతికి కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతుల్లో భరోసాను నింపడమే కాకుండా తెలంగాణ రైతును దేశానికే ఆదర్శంగా నిలిపేలా కృషి జరుగుతుందని వారు పేర్కొన్నారు.