శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ
ఆలయ మహాద్వారా ప్రవేశం
వేదాశీర్వచనం చేసిన పండితులు
తిరుమల,నవంబరు 27 ( జనం సాక్షి ) : తిరుమల శ్రీవారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని ప్రధాని దర్శించుకున్నారు. మోదీకి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి విూదుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ జీయర్‌లు శ్రీవారి శేష వస్త్రంతో మోదీని సత్కరించారు. దర్శనానంతరం వకులమాత, విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపం వద్ద మోదీకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ప్రధాని హోదాలో మోదీ నాలుగో సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తిరుమలకు చేరుకున్న మోదీ ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. అయితే షెడ్యూల్ కంటే అర్ధగంట ముందుగానే అంటే 7:30 గంటలకే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మోదీ ఒక్కరే శ్రీవారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. ప్రధానితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు చేరుకున్నప్పటికీ మోదీ మాత్రమే ఒంటరిగా స్వామివారిని దర్శించుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించలేదు. అలాగే విూడియాపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేశారు. గతంలో మోదీ తిరుమల పర్యటనకు వచ్చిన మూడు సందర్భాల్లో కూడా ప్రధాని పర్యటనను కవర్ చేసేందుకు విూడియాకు అనుమతించింది. అయితే నేడు మోదీ పర్యటనను కవర్ చేసేందుకు విూడియాను కూడా అనుమతించని పరిస్థితి. అత్యంత రహస్యంగానే మోదీ పర్యటన కొనసాగింది. దర్శనానంతరం ఆయన బస చేసిన అతిథి గృహానికి వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, అల్పాహారం సేవించిన అనంతరం కాసేపటి క్రితమే మోదీ తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.