శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, జులై10(జ‌నంసాక్షి) : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం వేకువజామున స్వామివారికి సుప్రభాతం నిర్వహించిన అనంతరం మూలవిరాట్‌ను పట్టు పరదాతో పూర్తిగా కప్పివేశారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి, ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజా సామాగ్రి తదితర వస్తువులను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రం చేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచీలీగడ్డ తదితర సుగంధం ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయ అంతటా ప్రోక్షణం చేశారు. ఆలయ శుద్ధి కారణంగా మధ్యాహ్నం వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఆలయ శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించి మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీవారికి నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు.