శ్రీశైలంలో శ్రావణమాస శోభ


తొలిసోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు
శ్రీశైలం,ఆగస్ట్‌9(జనంసాక్షి): శ్రీశైలంలో శ్రావణశోభ సంతరించుకుంది. తొలి సాఓమవారం కావడంతో భక్తులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. వేకువజామున నుంచే ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. శ్రావణమాసం మొదటిరోజు అందులోనూ మల్లికార్జునస్వామి వారికి ప్రీతికరమైన సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో శ్రావణమాసోత్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరొన నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శీఘ్ర దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు బిస్కట్‌ పాకెట్లు, పాలు, పులిహోర, మజ్జిగ, మంచినీళ్లు అందిస్తున్నారు.