షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు
నాగర్ కర్నూలు,నవంబర్22(జనంసాక్షి): నాగర్‌కర్నూల్ పట్టణంలోని మార్కెట్ యార్డులోని ఓ కిరాణా దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో దుకాణంలోని సామగ్రి బయటకి తీసే క్రమంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న సురేష్, వరలక్ష్మి దంపతులు పట్టణంలోని మార్కెట్ యార్డులో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం షార్ట్‌సర్క్యూట్‌తో దుకాణంలో ఉన్న టపాసులకు మంటలు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో దుకాణంలోని సామగ్రిని బయటికి తీసే క్రమంలో భార్యాభర్తలిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపుచేసి గాయపడిన వారిద్దరిని 108 వాహనంలో నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం వీరిద్దరినీ మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.